Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కట్టెల పొయ్యిపై వంట
- సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నిరసన
- పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
పెట్రోలు, డీజిల్.. నిత్యావసరాలు, వంట గ్యాస్ ధరల పెంపు.. ప్రభుత్వ రంగాల గంపగుత్త అమ్మకం.. కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడమేనా అచ్ఛేదిన్ అంటే మోడీ.. అచ్ఛేదిన్ అచ్ఛేదిన్ అంటూ.. సామాన్యుల సచ్ఛేదిన్ చేస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలంటూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ర్యాలీలు తీసి.. మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, కోనరావుపేట మండలం నిమ్మపళ్లిలో ఆందోళన చేశారు. జిల్లా కేంద్రంలో కట్టెల పొయ్యిపై వంటచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సాయిబాబ ఆలయం వద్ద ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందికొండ గీత ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్‌బండతో నిరసన తెలిపారు. వనపర్తి జిల్లాలో నాయకులు ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్పీ క్యాంప్ సెంటర్లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైరా పట్టణంలో ర్యాలీగా వెళ్లి ప్రధాన రహదారి వద్ద నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోనూ దిష్టిబొమ్మ దహనం చేశారు.
పట్నం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ దేవేందర్‌నగర్ కాలనీలో మహిళలు పెద్దఎత్తున ఖాళీ సిలిండర్లతో నిరసన చేపట్టారు.
నల్లగొండ కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. చిట్యాల మండల కేంద్రంలో కట్టెల పొయ్యిపై వంట చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో సిలిండర్ పెట్టి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కోదాడ పట్టణ కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రహదారిపై మహిళలు నిరసన తెలిపారు.
మోడీ చెప్పిన అచ్ఛేదిన్ దిన్ అంటే ధరలు పెంచి, ప్రజలపై భారాలు మోపడమేనా? అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రశ్నించింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో, కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన తెలిపారు. ఐద్వా హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ఏ.పద్మ, కె.నాగలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ధరలు పెంచుతూ అచ్ఛేదిన్‌కు బదులు చచ్చేదిన్ తీసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
ఇప్పటికే అనేకమార్లు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచిన బీజేపీ ప్రభుత్వం మరోసారి వంటగ్యాస్ ధరలను పెంచి పేదలపై మోయలేని భారాలు వేసిందని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్ విమర్శించారు. ధరల పెంపును నిరసిస్తూ హైదరాబాద్ యూసుఫ్‌గూడ చౌరస్తాలో టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు నిరసన చేపట్టారు. నాచారం మెయిన్ రోడ్డులో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లను పొయ్యిరాళ్లుగా మార్చి కట్టెలతో వంట చేశారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
ఎల్బీనగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో హయత్‌నగర్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. వంటావార్పు నిర్వహించారు. సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, పోటా పోటీగా భారాలు మోపుతున్నాయని కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి, టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. వంటగ్యాస్ సిలిండర్, విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ ఎల్బీనగర్ రింగ్ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు.