Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడేండ్ల గడువు ముగియడంతో ట్యాక్స్‌ల భారాలు
- విలీన గ్రామాల్లో నాలుగింతలపైనే పెరిగిన ఇంటి పన్ను
- పన్నుల మోతసరేగానీ.. సమస్యల పరిష్కారమేదంటున్న జనం
- పూర్తికాని అంతర్గత రోడ్లు, అస్తవ్యస్తంగానే డ్రెయినేజీ వ్యవస్థ
- అన్ని పురపాలికల్లో కనీసంగా మూడు నుంచి పది గ్రామాలు విలీనం
'ఉపాధి' దూరమై జనంలో తీవ్ర అసంతృప్తి
పట్టణాల్లో విలీనమైన గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ చట్టం కూడా అమలు కావడం లేదు. నాలుగు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 5,52,932కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉండగా.. 2021-22 ఏడాదికిగాను ఇప్పటివరకు 2,51,677 కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. ఏడాదిలో వంద రోజుల పనికిగాను సగటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48రోజులే పని కల్పించగా.. రోజుకు రూ.170 కూలి గిట్టుబాటు కాలేదు. రెక్కలు, ముక్కలు చేసుకుని పనిచేస్తే దానికీ సరిగా వేతనాలు చెల్లించడం లేదు. చట్టం ప్రకారం రోజుకు రూ.211 కూలి చేతికి అందడం లేదు. సగటు కూలి రూ.151 నుంచి రూ.170 వరకు పడుతున్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో రూ.125 కూడా దక్కట్లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ చట్టం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే అమలు కావాలన్న నిబంధనతో పట్టణాల్లో విలీనమైన గ్రామాల ప్రజలు 'ఉపాధి'కి పెద్దఎత్తున దూరమయ్యారు.
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
'ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా విలీన గ్రామాలు, శివారు కాలనీల్లో అభివృద్ధి జరగాలి. లేదంటే మా ప్రాంతాన్ని పురపాలికల్లో ఎందుకు కలిపారని అక్కడి ప్రజలు ప్రజాప్రతినిధులను తిట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇందుకు సమాధానం చెప్పాలంటే విధిగా మనం అభివృద్ధి పనులు చేసి చూపించాలి.' - 2022 మార్చి 18న కరీంనగర్ నగరపాలక సంస్థ నేతలు, అధికారులతో ఐటీ టవర్‌లో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్న మాటలివీ...
రాష్ట్రంలోని 73 గ్రామ పంచాయతీలను 2019 ఆగస్టు 1వ తేదీన మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు.. మరో 131 గ్రామపంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన మినిట్స్ బుక్, బిల్డింగ్ పర్మిషన్ రిజిస్టర్లు, మ్యూటేషన్ రిజిస్టర్లు, ఇంటి నెంబర్ల రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లు, రికార్డు రూం తదితర రికార్డులు, ఫర్నిచర్‌ను సీజ్ చేసి సేఫ్ కస్టడీలో ఉంచి రెండేండ్లుగా వాటి రికార్డును ఆన్లైన్ చేసింది. ఈ క్రమంలో మున్సిపల్ పరిధిలో విలీనం అయిన పంచాయతీల్లో పన్నులు యథావిథిగానే ఉంటాయని చెప్పుకొచ్చింది. తొలుత ఐదేండ్ల వరకు అని చెప్పి.. తీరా రెండేండ్లే గడువు అని ప్రకటించింది. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మూడేండ్లకు ఆ గడువు పెంచింది. ఇప్పుడు ఆ గడువూ ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విలీన గ్రామాల్లో పన్నుల మోతకు సర్కారు సన్నద్ధమైంది.
అప్పుడు రూ.500కూడా దాటని ఇంటికి ఇప్పుడు రూ.2వేలపైనే ట్యాక్స్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో విలీనం అయిన గ్రామాల్లో పెరిగిన ఇంటి పన్నులను చూసి జనం ఆందోళన చెందుతున్నారు. విలీనమైన గ్రామాల్లో ఈ నెల 1 నుంచే మున్సిపల్ సిబ్బంది సంబంధిత ఇంటి యజమానులకు గృహపన్నుకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేస్తూ వస్తున్నారు. అయితే, మున్సిపల్లో విలీనమైనప్పటి నుంచి మొన్నటివరకు ఏడాదికి రూ.500కూడా దాటని ఇంటి పన్ను.. ఇప్పుడు రూ.2వేలకుపైనే రావడం చూసి ఆందోళన చెందుతున్నారు. రూ.వెయ్యి వరకు వచ్చే ఇంటికి రూ.3వేలు, రూ.2వేలు వచ్చే ఇంటికి రూ.6వేలు ఇలా.. ఆ ఇంటి నిర్మాణ విస్తీర్ణం, అంతస్తులను బట్టి నాలుగింతలకుపైనే పన్ను పెరిగింది. దీంతో ఇన్నాళ్లూ పంచాయతీ పరిధిలోని ట్యాక్స్ మాత్రమే కట్టిన విలీన గ్రామాల ప్రజలు.. పెరిగిన ఇంత పెద్దమొత్తంలో పన్నులు కట్టాలంటే ఆందోళన చెందుతున్నారు.
రెండు కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం రెండు కార్పొరేషన్లు ఉండగా.. కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాల్టీలుగా ఉన్నాయి. ఇందులో కొత్తగా ఏర్పడిన రాయికల్, ధర్మపురి, సుల్తానాబాద్, మంథని సహా ఇదివరకే ఏర్పడిన మున్సిపాల్టీల్లో సమీపంలో ఉన్న కొన్ని గ్రామాలు విలీనం అయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే 8పంచాయతీలను విలీనం చేసింది. అందులో పద్మనగర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామాలు విలీనం అయ్యాయి. ఇలా కనీసంగా మూడు నుంచి పది గ్రామాల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆయా మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వం కలిపేసింది. పట్టణ కేంద్రాల్లోనే సరైన రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేవు. ఇక విలీన గ్రామాల్లో అయితే పరిస్థితి దయనీయంగా ఉంది.
ఇంటి పన్ను తగ్గించాలి
కెంగర్ల నాగరాజు- అల్గునూర్
పేరుకు మున్సిపాలిటీలో కలిసినా పట్టణాభివృద్ధి పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా కల్లోలం నుంచి బయటపడి కొంత ఉపాధి దొరుకుతున్న సమయంలో పన్నుల భారం వేయడం సరికాదు. మున్సిపాలిటీలో కలిసిందన్న పేరుతో ఏకంగా నాలుగింతలు ఇంటి పన్ను వసూలు చేయడం దారుణం. వెంటే ఇంటి పన్నులను తగ్గించాల్సిందే!.