Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పాలు, పాలఉత్పత్తులపై విధించిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీఎస్టీని నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో పాల డబ్బాలతో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ డెయిరీ ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పాలు, పాల ఉత్పత్తులు, ప్యాకింగ్‌తో అమ్మే పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీర్ మొదలైన డైరీ ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడాన్ని తప్పుపట్టారు. అంతేగాక డెయిరీకి సంబంధిత పరికరాలు, యంత్రాలపై 12 శాతం నుంచి 18 శాతానికి పెంచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులు, పాల ఉత్పత్తిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను విధించడం ద్వారా కోట్లాది మంది పేదలపై భారం పడుతుందనీ, డెయిరీ రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సహకార సంఘాలకు ఈ నిర్ణయం గొడ్డలి పెట్టులాంటి దన్నారు. కేంద్రంలో రాజకీయ అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాష్ట్రాల హక్కుల్ని మోడీ సర్కారు కాలరాస్తున్నదని విమర్శించారు. దేశంలో అణగారిన, వెనుబడిన తరగతులకు పోషకాహారాన్ని అందకుండా బీజేపీ సర్కారు అవరోధం సృష్టిస్తున్న దని విమర్శించారు. జీఎస్టీని అడ్డంపెట్టుకుని మోడీ సర్కారు రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్నదని చెప్పారు. జీఎస్టీ విధించడాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే డెయిరీ రైతులు, సహకార సంఘంలో పని చేసేవారు, చిన్న చిన్న వ్యాపారులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, మాదినేని రమేష్, మోకు కనకారెడ్డి, తుమ్మల వెంకటరెడ్డి, పల్లపు వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.కుమారస్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు గునిగంటి రాజన్న, రాపర్తి సోమన్న, సూడి కృష్ణరెడ్డి, మోతిరాం నాయక్, భూక్యా చందు తదితరులు పాల్గొన్నారు.