Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్కరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ : మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికి మోసపూరితమైనవని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన మీదటనే బీజేపీ సర్కార్ ఇటువంటి లీకేజీలు ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లకు మీటర్లపై కేంద్రం వెనకడుగు అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియా ప్రతినిధులు మంత్రి వద్ద ప్రస్తావించగా స్పందించారు. వ్యవసాయ చట్టాల విషయంలోనూ గతంలో ఇదే జరిగిందన్నారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ, తదనంతర కాలంలో మళ్లీ అవే చట్టాలు తీసుకొస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను గుర్తు చేశారు. సంస్కరణల మార్పు విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదన్నారు. సంస్కరణలను ప్రతిపాదించిన రోజున కేంద్రం పంపిన దానికి ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ ద్వారా స్పష్టంగా తెలియజేశారని చెప్పారు. తాజాగా వస్తున్న లీకేజీలపై కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదించిన పక్షంలో ప్రజల గొంతుకకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఉంటుందన్నారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటివన్నారు.