Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌కు టీఎస్టీసీఈఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని సాంకేతిక కాలేజీల్లో అధ్యాపకులకు చెల్లిస్తున్న జీతాలు, కల్పిస్తున్న వసతులపై విచారణ చేపట్టాలని తెలంగాణ స్కూల్, టెక్నిక్ కాలేజీ అధ్యాపకుల సంఘం (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మెన్ జస్టిస్ పి స్వరూప్రెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. 2019-20 విద్యాసంవత్సరంలో టీఏఎఫ్ఆర్సీ ఇంజినీరింగ్ సహా వృత్తి విద్యాకోర్సుల ఫీజులను పెంచిందని తెలిపారు. విద్యార్థుల నుంచి పూర్తి ఫీజులు కాలేజీ యాజమాన్యాలు కట్టించుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని విమర్శించారు. ఎక్కడా వేతన సంఘం సిఫారసుల ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకుల జీతాల వివరాలను మాత్రం ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్, టీఏఎఫ్ఆర్సీకి వేర్వేరుగా సమర్పిస్తున్నాయని వివరించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ చెల్లించడం లేదని తెలిపారు.