Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసుతో తనకెలాంటి సంబంధమూ లేదన్న నిందితుడు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే విధ్వంసం కేసులో కీలక నిందితుడు ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురి విచారణను దర్యాప్తు అధికారులు గురువారం పూర్తి చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందలాది మంది ఆర్మీ ఉద్యోగార్థులు విధ్వంసానికి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్టయిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావుతో పాటు మరో ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గత మూడు రోజులగా విచారించారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న ఈ నలుగురి విచారణ గురువారంతో పూర్తి కావటంతో తిరిగి కోర్టులో హాజరు పరిచి చంచల్గూడ జైలుకు దర్యాప్తు అధికారులు తరలించారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ అనురాధ స్వీయ పర్యవేక్షణలో వీరి విచారణ సాగింది. ముఖ్యంగా, దాదాపు రెండు వేల మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడటానికి సుబ్బారావు పన్నిన కుట్రే కారణమన్న కోణంలో విచారణ సాగినట్టు తెలిసింది. ఒక వ్యూహం ప్రకారం వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి తన అనుచరులతో వందలాది మంది ఉద్యోగార్థులను వ్యూహాత్మకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చేలా చేసి హింసకు పాల్పడ్డారా? అంటూ పలు ప్రశ్నలను సుబ్బారావుపై విచారణాధికారులు సంధించినట్టు తెలిసింది. అందుకు ఉప్పల్లో మకాం వేసి సుబ్బారావు ఈ వ్యూహాన్ని అమలు చేశాడా? అనే దిశగా కూడా ప్రశ్నించినట్టు సమాచారం. కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నాననే కోపంతోనే ఈ కుట్రకు పాల్పడ్డావా? అని సుబ్బారావును నిలదీసినట్టు తెలిసింది.