Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు జిల్లాల్లో డీఈవోల చర్యలు
- విద్యార్థులెక్కువున్న బడులకు పంపుతున్న వైనం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. తక్కువ మంది విద్యార్థులుండి అవసరానికి మించి ఉపాధ్యాయులుంటే ఎక్కువ మంది విద్యార్థులుండి సరిపోయినంత మంది టీచర్లు లేని సర్కారు బడులకు వారిని పంపిస్తున్నారు. అంటే పనివిభజన చేపడుతున్నారు. ఇలా పలు జిల్లాల్లో జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో)లు చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపడుతున్నామంటూ ఆదేశాలు విడుదల చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవో) తక్కువ మంది విద్యార్థులున్న చోట ఉన్న ఉపాధ్యాయులను ఎక్కువ మంది విద్యార్థులుండి టీచర్ల అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థులు ఎక్కువగా ఉండి సబ్జెక్టు టీచర్ల కొరతతో బాధపడుతున్న వారికి ఇది ఉపశమనం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల సర్కారు బడుల్లో 1.09 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారిని అవసరమైన బడులకు సర్దుబాటు చేసే పనిలో డీఈవోలు నిమగమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్ని ఖాళీలున్నాయో, ఉపాధ్యాయులు ఎంత మంది అవసరమో లెక్క తేలనుంది. ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయానికి పంపిస్తారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించే అవకాశమున్నది. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఆయా ఖాళీ పోస్టుల్లో విద్యావాలంటీర్లను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశమున్నట్టు తెలిసింది. 2019-20 విద్యాసంవత్సరంలో 15,661 మంది విద్యావాలంటీర్లను నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఎంత మందిని నియమిస్తారో వేచిచూడాల్సిందే. అయితే బడిబాట కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో ఇప్పటి వరకు 1,72,613 మంది విద్యార్థులు చేరారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో విద్యార్థులు ఎక్కువున్న బడులకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు.
సర్దుబాటుతో ఎంతకాలం న్యాయం చేస్తారు? : శివానందస్వామి
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వాలంటీర్లనైనా తీసుకోవాలి లేదంటే వెంటనే శాశ్వత నియామకాలైనా చేపట్టాలని తెలంగాణ విద్యావాలంటీర్ల సంఘం (టీవీవీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు మఠం శివానందస్వామి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో పనివిభజన చేపట్టి విద్యార్థులకు ఎంత కాలం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బడిబాట నిర్వహించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల కొరతపై తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. బడిబాటలో కొత్త విద్యార్థులు చేరుతున్నారనీ, ప్రయివేటు బడుల నుంచి వస్తున్నారని తెలిపారు. విద్యావాలంటీర్లు లేదంటే శాశ్వత నియామకాలు చేపట్టి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని పెంచాలని కోరారు. ఉపాధ్యాయుల కొరతను అధిగమించడంలో ప్రతి ఏటా ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.