Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో ఒప్పంద ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేపట్టేందుకు యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసింది.ఈ నియామకాల కోసం సంస్థలో దాదాపు 1100 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. విధినిర్వహణలో మరణించిన, తీవ్ర అనారోగ్యాలతో మంచం పట్టిన, సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబసభ్యులు కారుణ్య నియామకాలకు అర్హులు. దాదాపు ఎనిమిదేండ్లుగా వీరు ఈ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీలో ఈ తరహా కారుణ్య నియామకాలను రెగ్యులర్ ఉద్యోగుల ప్రాతిపదికన నియమించేవారు. 2019లో ఆర్టీసీ కార్మికుల 52 రోజుల సమ్మె సమయంలో మరణించిన 38 మంది కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులర్ ప్రాతిపదికనే విధుల్లోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు చేపడుతున్న కారుణ్య నియామకాలన్నీ ఒప్పంద ప్రాతిపదికన చేపట్టడం గమనార్హం. వీరిలో 2019కు ముందు మరణించిన కార్మికుల కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. మూడేండ్ల కాలపరిమితికి కారుణ్య నియామక ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత విధి నిర్వహణలో వారి ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటూ 'పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ టెస్ట్' నిర్వహిస్తారు. దానిలో కనీసం 60 శాతం మార్కుల్ని సాధిస్తేనే, పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ పరీక్ష రాయడానికి సంవత్సరంలో కనీసం 240 రోజులు పనిచేసి ఉండాలనే షరతు విధించారు. అంటే మూడేండ్లలో కనీసం 720 రోజుల పనిచేసి ఉండాలి. అప్పుడే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ టెస్ట్‌కు అర్హులవుతారు. కారుణ్య నియామకాల్లో గతంలో అర్హతలను బట్టి క్లరికల్ ఉద్యోగాల్లోనూ నియమించేవారు. ఇప్పుడే కేవలం నాలుగు కేటగిరిల్లోనే నియామకాలు చేపడుతున్నారు. కన్సాలిడేటెడ్ పేమెంట్ ప్రాతిపదికగా గ్రేడ్-2 డ్రైవర్‌కు నెలకు రూ.19వేలు వేతనం చెల్లిస్తారు. గ్రేడ్-2 కండక్టర్‌కు రూ.17వేలు, ఆర్టీసీ కానిస్టేబుల్‌కు రూ.15వేలు, శ్రామిక్‌కు రూ.15వేలు చొప్పున వేతనాలు చెల్లిస్తారు. మూడేండ్ల తర్వాత అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే రెగ్యులర్ ఉద్యోగంలోకి తీసుకుంటారు.
అలాగే కారుణ్య నియామకాల ద్వారా విధుల్లో చేరితే ఏమేం చెయ్యకూడదు అనే 38 షరతులను కూడా విధించారు. ఈ షరతుల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా విధుల్లో నుంచి తొలగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. అలాగే డ్రైవర్లు అయితే రూ.వెయ్యి, కండక్టర్లు అయితే రూ.2,500 సెక్యూరిటీ డిపాజిట్ కింద విధులకు వెళ్లే ముందు యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దుర్మార్గం ..
అర్హత పరీక్షలు, అర్థంలేని షరతులు...ఇవన్నీ మూడేండ్ల పాటు వారిని శ్రమదోపిడీకి గురిచేయడమే. తక్షణం ఈ ఉత్తర్వులను సవరించాలి. రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి.