Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో కేంద్రం వాదన
- తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు నిబంధనల ప్రకారమే కేటాయించామని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) జోక్యం చెల్లదని చెప్పింది. క్యాట్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ కేంద్రం వేసిన అప్పీళ్లపై హైకోర్టులో గురువారం వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును తర్వాత వెల్లడిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ ఎస్.నంద ధర్మాసనం తెలిపింది. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులపై కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించిందనీ, ఈ కమిటీ కేటాయింపులకు వ్యతిరేకంగా క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని కేంద్రం ధర్మాసనం ఎదుట వాదించింది. సివిల్స్ సర్వీస్ అధికారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే కేడర్ కంట్రోలింగ్ అథారిటీ అని చెప్పింది. తమకు నచ్చిన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు ఆ అధికారులకు లేదని స్పష్టం చేసింది. కేంద్రం వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. న్యాయస్థానంలో ఇది వరకే సోమేష్‌కుమార్ సహా మరో 15 మంది కేంద్ర సర్వీస్ అధికారుల వాదనలు పూర్తి అయ్యాయి.
సాయిపల్లవికి కోర్టులో చుక్కెదురు
గో సంరక్షకుల వ్యవహారంపై సినీనటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై సుల్తాన్ బజార్ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. విరాట్ పర్వం సినిమా ప్రచార కార్యక్రమంలో ఆమె ఉగ్రవాదులతో గో సంరక్షకులను పోల్చారంటూ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆమెకు పోలీసులు ఇచ్చిన నోటీసును సాయిపల్లవి హైకోర్టులో సవాలు చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదని ప్రభుత్వం చెప్పింది. కేసు నమోదు కానప్పుడు నోటీసును కొట్టేయలేమని హైకోర్టు చెప్పింది. పాయిపల్లవి రిట్‌ను డిస్మిస్ చేసింది.
కోర్టు ఆవరణ న్యాయవాది మృతి
హైకోర్టు ఆవరణలో గోవర్ధన్‌రెడ్డి అనే న్యాయవాది ఆకస్మికంగా మరణించారు. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీగా పని చేసిన ఆయన గురువారం 14వ కోర్టు హాలు వద్ద అకస్మాత్తుగా పడిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేదు. హైకోర్టులో కనీస వైద్య సదుపాయలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ చిక్కుడు ప్రభాకర్, పి.ప్రదీప్ కుమార్ రెడ్డి అనే న్యాయవాదులు హైకోర్టు సీజేకు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టులో కనీస వైద్య సదుపాయాలు ఉంటే గోవర్దన్‌రెడ్డి ప్రాణాలు నిలిచి ఉండేవన్నారు.