Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమల్‌చంద్రకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఘనస్వాగతం
- రెండు నియోజకవర్గాలకే పరిమితమా..?
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో కాకతీయుల వారసులు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ ముఖ్య అతిధిగా పాల్గొనడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కమల్‌చంద్ర ఛత్తీస్‌గఢ్‌లో ప్రముఖ బీజేపీ నాయకుడు కావడం గమనార్హం. అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఒంటికాలిపై నిల్చొని బీజేపీపై విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ప్రధాని మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని విమర్శిస్తూ, తీవ్ర విమర్శలకు దిగుతున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అదే బీజేపీ నేతకు ఘనంగా స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ వ్యవహారశైలి వెనుక రాజకీయ కారణాలున్నాయా.. అన్న చర్చ సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం మాటల యుద్ధంతో రక్తి కట్టిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో కాకతీయ వైభవ సప్తాహం వేడుకలకు కాకతీయుల వారసుడైన కమల్ చంద్ర భాంజ్‌దేవ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గురువారం భద్రకాళి దేవాలయానికి చేరుకున్న కమల్‌చంద్రకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్ ఘనంగా స్వాగతం పలికారు. కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ ఛత్తీస్‌గఢ్ బీజేపీ నేత కావడం గమనార్హం. 2013లో నాటి సీఎం రమణ్‌సింగ్ హయాంలో కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ బీజేపీలో చేరి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర యూత్ కమిషన్ చైర్మెన్‌గా నియమితులయ్యారు. సహాయక మంత్రి హౌదాలో ఆయన యూత్ కమిషన్ చైర్మెన్‌గా వ్యవహరించారు. ఈ పదవి కేబినెట్ సహాయ మంత్రి హౌదాతో సమానం. అంతేకాదు, 2013 ఎన్నికల్లో వై ప్లస్ భద్రతనూ కల్పించారు. ప్రస్తుతం బీజేపీ బస్తర్ జిల్లాలో క్లస్టర్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నట్టు స్థానిక బీజేపీ పార్టీ నేతలు వెల్లడించారు. రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జిగా కమల్‌చంద్ర వ్యవహరించడం గమనార్హం. కమల్‌చంద్ర హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటనకు సంబంధించిన సమాచారం తెలంగాణ బీజేపీ శాఖకు తెలియచేయకపోవడంతో ప్రొటోకాల్ అమలు చేయడానికి స్థానిక బీజేపీ నేతలు రాలేదని సమాచారం. బీజేపీపై ఒంటికాలిపై లేచి విమర్శిస్తున్న అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆర్భాటం, హంగులతో ఘనస్వాగతం పలకడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేయాల్సిన వేడుకలను రెండు నియోజకవర్గాలకే పరిమితం చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. పరకాల, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోనూ పలు ప్రాంతాల్లో చేయాల్సి ఉన్నా, వాటిని పట్టించుకోకపోవడం గమనార్హం.
తెలిసే ఆహ్వానించారా.. తెర వెనుక కథేంటి..
ఛత్తీస్‌గఢ్ బీజేపీలో కీలక నేతగా కాకతీయుల వారసులు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ ఉన్నారన్న విషయం తెలిసే అధికార టీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించిందా.. అన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ దిశా నిర్ధేశంతోనే యుద్ధప్రాతిపదికన 4-5 రోజుల ముందు కాకతీయ వైభవ సప్తాహాన్ని ప్రకటించారు. ఆయన మంత్రాంగంతోనే కాకతీయుల వారసుడిని ఆహ్వానించినట్టు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. మంత్రి కేటీఆర్ సూచన మేరకే కమల్‌చంద్ర భాంజ్‌దేవ్.. వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన సమాచారాన్ని తెలంగాణ బీజేపీ శాఖకు తెలపలేదా.. లేక రాజకీయ రచ్చ వద్దని ముందే రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని సహకరించమని కోరారా అన్న విషయాలు కూడా చర్చకు దారితీశాయి. బీజేపీ నేత కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ హన్మకొండకు వచ్చినా బీజేపీ నేతలు ఆయనకు స్వాగతం పలకడానికి రాకపోవడం సందేహాలకు తావిస్తుంది. బీజేపీ రాష్ట్ర నేతల సూచనతోనే స్థానిక నేతలు స్తబ్ధుగా ఉన్నట్టు సమాచారం.
రెండు నియోజకవర్గాలకే పరిమితమా..?
కాకతీయ వైభవ సప్తాహం వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలకే పరిమితం చేసినట్టు కార్యక్రమాలను బట్టి స్పష్టమవుతున్నది. ముగింపు వేడుకలు రామప్పలో పెట్టినా ములుగు జిల్లాలో కేవలం అదొక్క కార్యక్రమాన్ని మాత్రమే రూపొందించారు. వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనూ పలు కాకతీయ కట్టడాలు, దేవాలయాలు ఉన్నా ఆ ప్రాంతాల్లో వేడుకలు జరపకపోవడంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. ఏదేమైనా కాకతీయ వైభవ సప్తాహం వేడుకలకు బీజేపీ నేత, కాకతీయుల వారసులు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్‌ను ఆహ్వానించడం రాజకీయంగా దుమారం రేగే అవకాశం లేకపోలేదు.