Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుడిసెలను తొలగించేందుకు అటవీ అధికారుల యత్నం
- ప్రాణం పోయినా కదిలేదిలేదన్న గిరిజనులు
- వెనుదిరిగిన అధికారులు, పోలీసులు
- గతంలో 12 మంది గిరిజన మహిళలపై అక్రమ కేసులు
నవతెలంగాణ- దండేపల్లి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మాకులపేట పంచాయతీ పరిధిలోని కోయపోషగూడలో మళ్లీ పోడు వివాదం రగిలింది. జూన్ నెలలోనూ ఇదే వివాదంపై 12 మంది గిరిజన మహిళలపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే, ప్రాణం పోయినా భూములను వదిలేది లేదంటూ పోడుసాగుదారులు పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో పోడు భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను గురువారం అధికారులు తొలగించేందుకు యత్నించారు. గుడిసెలు తొలగించి తమ గూడానికి వెళ్లాలని కోరారు. కానీ గిరిజనులు ససేమీరా అనడంతో ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహాయంతో పోడు భూముల్లో గిరిజనులు వేసుకున్న తాత్కాలిక గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించారు. గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటించారు. గుడిసెల తొలగింపులో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. గిరిజనులు, అటవీ అధికారులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
ఈ సందర్భంగా పలువురు కోయపోషగూడ గిరిజనులు మాట్లాడుతూ.. తమకు ఉన్న ఒక్క ఆధారం ఈ భూమేనని చెప్పారు. ప్రభుత్వం తమకు సహాయం చేయాల్సింది పోయి అధికారులను ఉసిగొల్పుతూ దాడులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడే ఉంటామని, బలవంతంగా తొలగించాలని చూస్తే ప్రాణ త్యాగానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని వేడుకున్నారు.
గుడిసెలను తీయడానికి పోడుసాగుదారులు ఒప్పుకోకపోవడంతో అధికారులు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ.. వారు గుడిసెలు వేసుకున్న స్థలం పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉందన్నారు. గిరిజనులు తమకు సహకరించి ఖాళీ చేయాలని కోరారు. అడవిని కాపాడటం తమ బాధ్యతని, వారి సమస్య పరిష్కారం తమ చేతిలో లేదని చెప్పారు.