Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ప్రతిఘటన తప్పదు. : జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు సాగుదారులపై ప్రభుత్వ నిర్భందాన్ని ఆపాలనీ, లేదంటే ప్రజా ప్రతిఘటన తప్పదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య పార్కువద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు రైతులనుంచి సేకరించిన ధరఖాస్తులపై ప్రభుత్వ వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. హక్కుపత్రాలిస్తామని భూములు లాక్కోవడం కేసీఆర్ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. పోడు సమస్యను కుర్చివేసుకొని కూర్చొని పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్ ..సాగుదారుల భూములను లాక్కొని హరితహారం మొక్కలు నాటడం, కందకాలు తొవ్వడం, తప్పుడు కేసులు బనాయించడం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేసిన పంటలను ట్రాక్టర్లతో ద్వంసం చేస్తున్న ఫారెస్టు అధికారుల పై కేసులు నమోదు చేసి చట్ట ఫరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం ధరఖాస్తులను పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ' సాగులో ఉన్నవారందరికీ హక్కు పత్రాలు ఇస్తాం , నేనే కుర్చీ వేసుకొని కుర్చోని సమస్యను పరిష్కరిస్తా'నని హామీ ఇచ్చిన సీఎం మాట తప్పారని తెలిపారు. పైగా సివిల్ పోలీసులు , ఫారెస్టు అధికారులను ఉసిగొల్పి సాగుదారుల అరకలు, ఎడ్లను భూముల మీదకు పోకుండా అడ్డుకుంటున్నారనీ, అధికారులే దాడులకు దిగుతున్నారని పేర్కొ న్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, బి పద్మ , పెద్ది వెంకట్రాములు, రాష్ట్ర కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వర రావు, రామ చందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు, మెరుగు సత్యనారాయణ, జాజీరి శ్రీను, నరసింహులు, మోహన్, సాంబశివ, స్వామి, గంగాధర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భారతి , డి వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్ష , కార్యదర్శులు కోట రమేష్, వెంకటేష్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభన్ నాయక్ మూడ్, గిరిజ సంఘం రాష్ట్ర అధ్య క్షుడు ధర్మ తదితరులు పాల్గొన్నారు.