Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే ధాన్యానికి స్థలం లేదు
- పరిశ్రమను బతికించాలి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి
నవత్ఱెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైస్ మిల్లుల పరిశ్రమను ఆదుకోవాలని తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఆ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. అనంతరం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, కోశాధికారి చంద్రపాల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరిశ్రమను కాపాడాలని కోరారు. సీఎం కేసీఆర్ రైస్ మిల్లర్లను పిలిపించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. భారత ఆహార సంస్థ తీసుకోకపోతే వానాకాలం, యాసంగిలో మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలను పౌరసరఫరాల సంస్థ నిలిపివేయడంతో తమ గ్యారంటీని కూడా ఉపసంహరించుకుంటున్నామనీ, ఈ మేరకు కమిషనర్‌కు లేఖ రాయనున్నట్టు తెలిపారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదనీ, రైతులకు పరిశ్రమ తోడుగా ఉంటుందని తెలిపారు. 1956 మిల్లింగ్ యాక్ట్ రాగా, ఆ తర్వాత కాలంలో సవరణలు జరిగాయని గుర్తుచేశారు. ఆరు శాతం ఉన్న తరుగును ఎనిమిది శాతానికి పెంచారనీ, అయినప్పటికీ తక్కువగా ఉన్నాయనీ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది తమకు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే దాదాపు రూ.35 వేల నుంచి రూ.40 వేల కోట్ల ధాన్యం అప్పగించారని చెప్పారు. ఇందులో 64 వేల క్వింటాళ్లు అంటే కేవలం రూ.15 కోట్ల తేడా వస్తే 63 రైస్ మిల్లులను వేధించడం తగదన్నారు. ఈ నెల 13న ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పిస్తామని తెలిపారు.
2014లో రాష్ట్రావిర్భావం నాటికి ధాన్యం ఉత్పత్తి 24 లక్షలు కాగా ప్రస్తుతం 90 లక్షల టన్నుల నిల్వకు పెరిగిందన్నారు. రాబోయే అక్టోబర్‌లో మరో 80 లక్షల టన్నులు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయంపై పెట్టిన శ్రద్ధతోనే ఉత్పత్తి పెరిగిందనీ, అదే విధంగా సేకరణ కూడా చేయాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ
రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు సమావేశం అనంతరం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసిన ప్రతినిధులు, తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సరైన స్టోరేజీ స్పేస్ లేకపోవడం, నెల రోజులుగా మిల్లింగ్ మూతపడటంతో వర్కర్లు తరలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఆరుబయట ఉన్న ధాన్యం తడిసిపోతున్నదని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మిల్లింగ్ సమస్యలపై ప్రభుత్వం నిరంతరం చర్చిస్తున్నదనీ, రాష్ట్ర రైతాంగంతో ముడిపడి ఉన్న ఈ సమస్యలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సమస్యలన్నింటినీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.