Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి కార్మికులను శ్రమదోపిడీకి గురిచేస్తున్న కేంద్రం
- కోల్ ఇండియాలో కార్మికులకు ఆదాయ పన్ను తిరిగి చెల్లింపు..
- ఏటా రూ.5నుంచి 7లక్షలు నష్టపోతున్న సింగరేణి కార్మికులు
- 11ఏండ్లుగా ఆర్థికంగా నష్టంపోతున్న వైనం
- స్పందించని గుర్తింపు సంఘం.. పట్టించుకోని సీఎం
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం.. ఒకే గమ్యం అనే నినాదం కార్మికుల చెవులకు వినసొంపుగా సింగరేణి యజమాన్యం వినిపిస్తున్నది. ఆచరణలో అందుకు విరుద్ధంగా అధికారులు, కార్మికుల మధ్య వ్యత్యాసం చూపుతోంది. దేశంలోని బొగ్గు గని కార్మికులు పొందుతున్న ఇల్లు, కరెంటు, నీళ్లు, గ్యాస్ తదితర సౌకర్యాలను లెక్కించి కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను విధిస్తున్నది. వీటిని కార్మికుల జీతాల నుంచి యాజమాన్యం మినహాయించి ప్రభుత్వానికి జమ చేస్తున్నది. కార్మికులు పొందే సౌకర్యాలపై ఆదాయం పన్ను విధించడం వల్ల ప్రతి కార్మికుడూ సాలీనా కనీసం రూ.60వేలు నష్టపోయారు. కోల్ ఇండియా కార్మికులతో పోల్చుకుంటే దాదాపు రూ.5నుంచి 7లక్షలు సింగరేణి కార్మికులు గడిచిన 11ఏండ్లలో నష్టపోయారు.
కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై విధిస్తున్న ఆదాయ పన్ను డబ్బులను 'బంగ్లా అప్ కీప్' పేరిట కోలిండియాలో యాజమాన్యమే తిరిగి కార్మికు లకు చెల్లించి ఊరట కల్పి స్తున్నది. ఈ సౌకర్యాన్ని కోల్ ఇండియా బొగ్గు గను లలో పనిచేస్తున్న అధి కారులు కూడా పొందు తున్నారు. సింగరేణి సంస్థలో కార్మికులకు మాత్రం 11ఏండ్లు దాటినా యాజమాన్యం నేటికీ చెల్లించడం లేదు. కానీ కోల్ ఇండియాలో లేని పలు సౌకర్యాలు సింగరేణి కార్మికులకు కల్పిస్తున్నామని యాజమాన్యం దాటవేస్తూ వస్తోంది. కోల్ ఇండియాలో అధికారులకు కూడా సౌకర్యాలపై విధించిన ఆదాయపన్ను డబ్బులను యాజమాన్యం తిరిగి చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని అమలు పరచుకుంటున్నారు.
కోల్ఇండియాలో అధి కారుల సంఘం చేసు కున్న ఒప్పందం ఆధారంగా సింగరేణిలో కూడా అధికారులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం ఏర్పాటు చేసుకుని సింగరేణిలో అమలు పరిచే విధంగా ఉత్తర్వులను జారీ చేశారు. అధికారులకు చెల్లించి కార్మికులకు ఎగ్గొట్టడం అత్యంత బాధాకరమని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర మంత్రుల హామీలపై కార్మికుల ఆగ్రహం
తెలంగాణలో అధికారంలోకి వస్తే కార్మికులకు కల్పించే సౌకర్యాలపై విధిస్తున్న ఆదాయ పన్నును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇస్తామని కేంద్ర మంత్రులు, బీఎంఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 8సంవత్సరాలుగా ఆదాయ పన్ను స్లాబుల్లో కనీస మార్పులు చేయకపోవడం వల్ల కార్మికులు లక్షలాది రూపాయల ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని గుర్తింపు సంఘం
సింగరేణి కార్మికులను సైనికులతో పోల్చుతున్న బీజేపీ కేంద్ర మంత్రులు, బీఎంఎస్ నాయకులు బొగ్గు గని కార్మికులకు ఆదాయ పన్ను ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. బడా వ్యాపారులకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు అనేక రాయితీలు కల్పిస్తూ ఉద్యోగం మీద బతికే కార్మికులను రకరకాల పన్నుల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలపై విధిస్తున్న ఆదాయ పన్ను విషయాన్ని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించి, నష్ట నివారణకు ప్రయత్నించకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
అధికారులకు ఇచ్చి మాకెందుకు ఇయ్యరు
అధికారులకు అలవెన్సులపై చెల్లించిన ఆదాయపు పన్ను డబ్బులను యాజమాన్యం తిరిగి వాపసు ఇస్తున్నది. కార్మికులకు మాత్రం ఇవ్వడం లేదు. ఒకే కుటుంబం అన్నప్పుడు ఇది వివక్ష కాదా. కష్టం చేసిన డబ్బులపై పన్నులు వేయటం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. 2011లో జరిగిన ఒప్పందాన్ని సింగరేణిలో అమలు చేయకపోవడం వల్ల మేము నష్టపోతున్నాం.
- అల్లి రాజేందర్, జూనియర్ అసిస్టెంట్