Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరిపివ్వని ముసురు
- అలుగు పోస్తున్న చెరువులు
- తెగిపోయిన రోడ్లు.. స్తంభించిన రాకపోకలు
- కిన్నెరసాని, తాలిపేరు గేట్లు ఎత్తివేత
- సింగరేణి ఓసీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- నల్లగొండలో గోడ కూలి ఇద్దరు మహిళలు మృతి
- కొన్ని చోట్ల పాఠశాలలకు సెలవు
ముసురు భారీ వర్షంగా మారింది. రెండ్రోజులుగా తెరిపివ్వకుండా ధారాళంగా కురుస్తూనే ఉంది. వానాకాలం సీజన్లో మొదటిసారిగా భారీ వర్షం కురిసింది. చెరువులు, వాగులు ఉరకలెత్తుతున్నాయి. ప్రాజెక్టులు వరద నీటితో నిండుతున్నాయి. చెరువులు పొంగుతుండటం.. కల్వర్టు పై నుంచి నీరు పారుతుండటంతో రోడ్లు తెగిపోయాయి.. గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పాఠశాలల్లోనూ వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో నల్లగొండ జిల్లాలో కొన్ని మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కిన్నెరసాని, తాలిపేరు జలాశయాల గేట్లు తెరిచారు. నల్లగొండలో గోడ కూలి ఇద్దరు మహిళలు నిద్రలోనే ప్రాణం కోల్పోయారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.
నవతెలంగాణ- విలేకరులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడ్రోజులుగా వర్షాలు కురుస్తున్నారు. సూర్యపేట జిల్లాలో ఆత్మకూర్(ఎస్) మండలంలో 194ఎంఎం అత్యధిక వర్షపాతం నమోదైంది. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అతి తక్కువ వర్షపాతం 1.2ఎంఎం నమోదైంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పద్మానగర్‌లో వర్షానికి ఇంటి గోడలు బాగా తడిచి తెల్లవారుజామున గోడ కూలడంతో ఇద్దరు మహిళలు నిద్రలోనే ప్రాణం కోల్పోయారు. మృతులు లక్ష్మి(42), ఆమె కూతురు కళ్యాణి(22)గా గుర్తించారు. కొన్నేండ్ల కిందట శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. వర్షాల కారణంగా నల్లగొండ, చండూరు, నాంపల్లి, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ తదిరత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
యాదాద్రి జిల్లాలోని అడ్డగూడురు మండలం ధర్మారం చెరువు అలుగుపోస్తుండటంతో లక్ష్మిదేవి కాల్వ, ధర్మారం నుంచి అడ్డగూడురు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గోవిందపురం అడ్డగూడురు మధలో ఉన్న నక్కలవాగు ఉధృతంగా అలుగుపోస్తుండటంతో గోవిందపురం, నాయాయ కుంట, గట్టు సింగారం గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఆత్మకూర్(ఎస్) మండలం దాచారం గ్రామంలో పత్తి చేను నీటమునిగింది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలో చెరువు నిండుకుండలా ఉంది.
ప్రాజెక్టుల్లో జల కళ
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఐదు సింగరేణి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వాగువంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాం తాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు విరిగి పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కొండిపుంజు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతున్న క్రమంలో శంకర్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. పాల్వంచ రూరల్ మండలంలో కిన్నెరసాని రిజర్వాయర్ ఆరు గేట్లు అడుగు మేర ఎత్తి 17వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్లలో తాలిపేరు జలాశయం నుంచి 20 గేట్లు అడుగుమేర ఎత్తి 11 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. చండ్రుగొండ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లలో ఆవరణమంతా చెరువును తలపించిం ది. వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక తరగతి గదుల్లోకి చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదు ర్కొన్నారు. టేకులపల్లిలో పై నుంచి వరద నీరు రావడంతో పంట చేలలో కరెంటు మోటార్లు కొట్టుకుపోయాయి. బూర్గంపాడులో దోమల వాగు, లోతు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి - కొత్తగూడెం మధ్య రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అశ్వాపురం మండలం మొండికుంట - సారపాక గ్రామాల మధ్య రహదారి పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి పరిధిలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, టేకులపల్లి, సత్తుపల్లి ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రోజుకు అన్ని ఓసీల్లో 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా శుక్రవారం 20 శాతం మాత్రమే ఉత్పత్తి చేశారు. ఓసీల్లో నీరు నిలిచింది. మరో రెండ్రోజులు బొగ్గు ఉత్పత్తి నిలిచే అవకాశం ఉంది. గోదావరి నీటి మట్టం పెరుగుతోంది.
బుగ్గవాగు ప్రవాహం
ఖమ్మం జిల్లా వైరాలో రిజర్వాయర్‌లో 16.5 అడుగులకు నీరు చేరింది. పాలేరు రిజర్వాయర్‌కు రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 18.4 అడుగులు కాగా 17 అడుగులకు నీరు చేరింది. రఘునాధపాలెం మండలం పాపటపల్లి- వీఆర్ బంజర గ్రామాల మధ్య ఉన్న బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తల్లాడ మండలంలోని తల్లాడ - గొల్లగూడెం రోడ్డు తెగిపోయింది. ఖమ్మంరూరల్ మండలంలో మున్నేరు, ఆకేరు వాగులు నిండుగా ప్రవహిస్తున్నా యి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మండలంలో 86.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
రోడ్డుపై చేపలు పట్టి సీపీఐ(ఎం) నిరసన
ఖమ్మం-కురవి జాతీయ రహదారిపై కాచిరాజుగూడెం వద్ద వర్షపు నీళ్లు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. రోడ్డుపై నీటిలో చేపలు పడుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలో సుబ్లేడు-మేడిపల్లి వెళ్లే రహదారిలో భవాని అమ్మవారి గుడి సమీపంలో వాగు నీరు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు దారి మళ్లించారు. కారేపల్లి మండలంలో బుగ్గవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పేరుపల్లి - మాధారం రహదారి కల్వర్టు పై నుంచి నీరు పొంగుతోంది.
వరద నీటిలో స్కూల్ బస్సు.. పిల్లలు సేఫ్
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మాచన్‌పల్లి- కోడూరు రైల్వే గేటు బ్రిడ్జి వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. రామచంద్రాపురం, సుగూరుతండాకు చెందిన 30 మంది విద్యార్థులను బస్సులో తీసుకెళ్తుండగా నీటిలో చిక్కుకుంది. విద్యార్థులు భయంతో పెద్దఎత్తున కేకలు వేయడంతో స్థానికులు వారిని రక్షించారు. వర్షాలకు దుందుబీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులోకి 19అడుగులకు నీళ్లు చేరడంతో నర్సంపేట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరస్సులో తూము వరకు నీళ్లు వచ్చి చేరడంతో ఖరీఫ్ పంటకు ఢోకా లేదని రైతులు చెబుతున్నారు. పరకాల ప్రాంతంలోని చలివాగు ప్రాజెక్టులో నీళ్లు చేరాయి.