Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోయపోషగూడ ఆదివాసీ గిరిజనులపై మళ్లీ అధికారులు దాడులకు తెగబడ్డారు. పోడు రైతుల ప్రతిఘటనతో గురువారం వెనుదిరిగిన అధికారులు శుక్రవారం పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా ఇష్టారీతిన కొట్టారు. వారి గుడిసెలను తొలగించారు. ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారిని రేంజ్ కార్యాలయానికి తరలిస్తుండగా ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఐ(ఎం) నేతలు అడ్డుకుని రోడ్డుపై బైటాయించారు.
- ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
- గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారుల జులుం
- గుడిసెల తొలగింపు..
- అడ్డుకున్న ఆదివాసీ మహిళలపై దాడి
- ఆరుగురు మహిళల అరెస్ట్
- సీపీఐ(ఎం), ఆదివాసీ గిరిజన సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ- దండేపల్లి
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మాకులపేట పంచాయతీ పరిధిలోగల పోడు భూముల్లో గిరిజనులు తాత్కాలిక గుడిసెలను వేసుకున్నారు. గతంలోనూ ఇక్కడ పోడు కోసం అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవ జరిగింది. అప్పట్లో 12 మంది మహిళలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. తదనంతరం పోడు రైతులు మళ్లీ ఆ భూముల్లో గుడిసెలు వేసుకోగా.. శుక్రవారం పోలీసుల సహాయంతో వచ్చిన అటవీ అధికారులు గుడిసెలను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన ఆదివాసీ గిరిజనులను తీవ్రంగా కొట్టారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు కారణమయ్యారంటూ ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి తాళ్లపేట రేంజ్ కార్యాలయానికి తరలించారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు తమపై దాడులకు దిగుతున్నారని, మహిళలని చూడకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా కొట్టి, పుస్తెలతాళ్లు తెంపారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై కూడా దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోడు స్థలాన్ని విడిచి పెట్టేది లేదని తెగేసి చెప్పారు.
సీపీఐ(ఎం), ఆదివాసీ గిరిజన సంఘం ధర్నా
ఆదివాసీ గిరిజన మహిళలపై దాడిని ఆదివాసి గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పద్మ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకే రవి తీవ్రంగా ఖండించారు. దాడిని నిరసిస్తూ ధర్నా చేశారు. బాధిత గిరిజనులతో మాట్లాడారు. అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తమపై దాడి చేసిన తీరును మహిళలు వివరించారు. అమాయక గిరిజన మహిళల అరెస్టు ప్రజాస్వామికమని, మహిళలను విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పోడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. మహిళలను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా.. తాళ్లపేట రేంజ్ కార్యాలయం గేటు వద్ద అడ్డుకున్నారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని సీపీఐ(ఎం), ఆదివాసీ నాయకులు గేటు ఎదుట బైటాయించారు. మరికొందరు రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. మహిళలను తీసుకెళ్లనీయకపోవడంతో.. చివరకు ఫారెస్ట్ అధికారులు తహసీల్దార్ హనుమంతరావును రేంజ్ కార్యాలయానికి పిలిపించి ఆరుగురు మహిళలను బైండోవర్ చేశారు. అనంతరం వారిని విడుదల చేశారు.
భూములు సాధించే వరకు పోరాటం
ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్‌రావు మోకాసి
ఆదివాసీ మహిళలపై దాడులు అమానుషమని, భూములు సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్‌రావు మోకాసి అన్నారు. ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసిన గుడిసెలను ఆయన పరిశీలించారు. అరెస్టు చేసిన మహిళలపై విడుదల చేయాలని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట బైటాయించి నిరసన తెలిపారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కుటుంబాలను చూసి జాలి పడాల్సిన అధికారులు దాడి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. పోరాటాలతోనే భూములు సాధించుకుంటామని చెప్పారు. కోయపోషగూడ గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆయన వెంట ఆదివాసి సేన ఉమ్మడి జిల్లా నాయకులు రాయి సిడాం జంగు, తొడసం భూమా పటేల్, విద్యార్థి సేన నాయకుడు రాము, నాయకులు జలపతి భింరావ్, మాధవరావు, బాదిరావు ఉన్నారు.
ఆ స్థలం రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉంది
డివిజనల్ ఫారెస్ట్ అధికారులు మాధవరావు
కోయపోషగూడ గిరిజనులు ఆక్రమించిన స్థలం పోడు భూమి కాదని, పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుందని డివిజనల్ ఫారెస్ట్ అధికారి మాధవరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. వారికి అన్ని విధాలా నచ్చజెప్పినా వినడం లేదని, మొండి పట్టుదలతో రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమంగా గుడిసెలు వేశారని అన్నారు. వారు తాత్కాలికంగా వేసిన గుడిసెలను తొలగించామని, ఈ సమయంలో తమ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపించారు. అదే స్థలంలో పండ్ల మొక్కలు నాటుకునేందుకు అనుమతిస్తామని, వాటి ద్వారా జీవనోపాధి పొందే అవకాశం ఉంటుందని కౌన్సెలింగ్ సైతం నిర్వహించినట్టు చెప్పారు. రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారికి భూమిని ఇచ్చే అంశం మా పరిధిలోనిది కాదని, అడవి రక్షణ కొరకు మాత్రమే పనిచేస్తామని అన్నారు.