Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
- పోస్టర్ ఆవిష్కరించిన నేతలు
- ఎన్ఈపీని రద్దు చేయాలని డిమాండ్
- ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలి
- ప్రయివేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 14న రాష్ట్రవ్యాప్తంగా బడుల బంద్ చేపట్టనున్నట్టు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. టి నాగరాజు, ఎండీ జావెద్, అశోక్‌రెడ్డి, లెనిన్ (ఎస్ఎఫ్ఐ), ఆర్ఎన్ శంకర్ (ఏఐఎస్ఎఫ్), రాము (పీడీఎస్‌యూ), జూపాక శ్రీనివాస్, మహేష్, గడ్డం శ్యామ్ (పీడీఎస్‌యూ), పరశురాం (పీడీఎస్‌యూ), గంగాధర్, నితీశ్, సృజన్ (ఏఐడీఎస్వో), కిరణ్ (ఏఐపీఎస్యూ), రోహిత్ (ఏఐఎస్బీ), మురళి (ఏఐఎఫ్డీఎస్) బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి వ్యతిరేక నూతన జాతీయ విద్యావిధానానం (ఎన్ఈపీ-2020)ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యావ్యాపారీకరణ, ప్రయివేటీకరణ, కేంద్రీకరణ కోసమే ఎన్ఈపీని తెచ్చిందని విమర్శించారు. పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, నియామకాలు, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. విద్యార్థుల బస్‌పాస్ ఛార్జీలను 200 శాతం పెంచడం వల్ల వారిపై పెనుభారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ ఉచితంగా బస్‌పాస్‌లను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 'మన ఊరు-మనబడి' కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా చూడాలనీ, అవసరమైన నిధులను విడుదల చేయాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ఆ కార్యక్రమాన్ని వర్తింపచేయాలని అన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా విద్యాప్రమాణాలు ఎలా మెరుగవుతాయని ప్రశ్నించారు. పర్యవేక్షణ అధికారులైన డీఈవో, డిప్యూటీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రయివేటు, కార్పొరేట్ విద్యారంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. వాటిలో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.