Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోయపోషగూడెం ఆదివాసీలపై దాడిని ఖండించండి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయ పోషగూడెం ఆదివాసీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో ఫారెస్టు అధికారులు, పోలీసులు జరిపిన దమనకాండను సీఐటీయూ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగుచేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకూ 200 మందికిపైన అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని విమర్శించారు. చంటిపిల్లల తల్లులని కూడా చూడకుండా 12 మంది ఆదివాసీ మహిళలను ఆదిలాబాద్ జైళ్లో వారంపాటు నిర్బంధించడం అన్యాయమని పేర్కొన్నారు. కోయపోషగూడెంలో ఆదివాసీలు తమ భూముల్లో ఉండగా డీఎఫ్ఓ, ఎఫ్ఆర్వోల నాయకత్వంలో 80 మంది ఫారెస్ట్ సిబ్బంది. సీఐ నేతృత్వంలో సుమారు ఐదుగురు ఎస్ఐలు, 70 మంది పోలీసులు మూకుమ్మడిగా దాడిచేసి వారి గుడిసెలను పీకేయడం అమానుషమని పేర్కొన్నారు. అధికారులను బతిమిలాడినా, కాళ్లు మొక్కినా కనికరించకపోవడం దారుణమని తెలిపారు. నోటికాడి బువ్వను మట్టిపాలు చేయడం, దొరికినోళ్లను దొరికినట్టు చితకబాదటం ఎంత వరకు సబబు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓవైపు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు హక్కుపత్రాలిస్తామని ప్రకటించి మరోవైపు వారిపై దాడులు చేయడం అంతరార్ధం ఏమిటని ప్రశ్నించారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న పోడు రైతులకు సీఐటీయూ అండగా ఉంటుందని హామీనిచ్చారు.