Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కోయపోషంగూడెం గిరిజనులపై అటవీ, పోలీస్ అధికారుల దాడిని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. పోడుసాగుదారులపై ఫారెస్టు అధికారుల నిర్బంధాన్ని ఆపాలనీ, లేదంటే ప్రతిఘటన తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈమేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల 12 మంది గిరిజన మహిళలను ఆదిలాబాద్ జైల్లో పెట్టారనీ, అదనపు బలగాలతో మళ్లీ ఆ గూడెంపై విరుచుకుపడ్డారని పేర్కొన్నారు. పేదల గుడిసెలను కూల్చడం,అరెస్టుల చేయడం సరైందికాదని తెలిపారు. అనాదిగా గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇస్తామనీ, దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ఇప్పుడు అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులను భూములపైకి పంపి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరి విడనాడాలని కోరారు. వలస గిరిజన గ్రామాల్లో నివాసం ఉంటున్న గిరిజనులు ఆధారాలు చూపించకుంటే ఆ భూములను స్వాధీనం చేసుకుంటామనీ, లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలివ్వాలని చట్టంలో ఉన్నప్పటికి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. గిరిజనులపై దాడి చేసిన పోలీస్, ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.