Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డికి విద్యుత్ ఉద్యోగుల ఫోరమ్ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్లో 1999 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఫోరం (టీఎస్‌ఈఈఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫోరం నాయకులు శ్రీనివాస్, మల్లేశం, సురేష్‌బాబు, ప్రేమ్, సంజీవ్, చక్రవర్తి, విజరు, ఉదరు, కృష్ణ, ముత్తయ్య, ప్రవీణ్ తదితరులు శుక్రవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెన్షన్ విధాన నిర్ణయాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టం-2022ను వ్యతిరేకిస్తున్నట్టు మంత్రి చెప్పారు. పాత పెన్షన్ అమలు సాధ్యాసాధ్యాలు, ఆర్థికభారం తదితర అంశాలను తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అందరికీ పెన్షన్ అమలుపై పూర్తి వివరాలతో వస్తే, మరోసారి సవివరంగా చర్చిద్దామని ప్రతినిధి బృందంతో అన్నారు. ఈ సందర్భంగా ఏఏ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారనే వివరాలను టీఎస్‌ఈఈఎఫ్ నేతలు మంత్రికి వివరించారు. అనంతరం ప్రతినిధిబృందం మీడియాతో మాట్లాడింది. 1999 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతూ అన్ని ఉద్యోగ, ఇంజినీర్ల సంఘాలను కలిసినట్టు తెలిపారు. అలాగే సంతకాల సేకరణ చేస్తామన్నారు. అందరికీ పెన్షన్ అనేది సామాజిక హక్కు అనీ, ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.