Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆంధ్రప్రదేశ్లో నర్సాపురం వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు ఎంపీ కే రఘురామ కష్ణంరాజు, ఆయన కొడుకు భరత్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. గచ్చిబౌలి పోలీస్టేషన్లో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఆ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్పై పోలీసులు విచారణ చేయకుండానే ప్రాథమిక దశలోనే కొట్టేయలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. భీమవరంలో ప్రధాని పాల్గొన్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు వెళ్లేందుకు బయలుదేరితే తన వెంట నెంబరు లేని కారు వెంబడించిందనీ, ఫరూక్ బాషా అనే వ్యక్తిని పట్టుకుని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని రఘురామరాజు రిట్లో పేర్కొన్నారు. అయితే కానిస్టేబుల్ బాషా ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు నమోదు చేశారన్నారు. ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. విధి నిర్వహణలో ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ బాషా పనిచేస్తున్నారనీ, ఈ విషయాన్ని చెప్పడమే కాకుండా ఐడీ కార్డు చూపిన తర్వాత కూడా ఎంపీ, ఆయన కొడుకు, సెక్యూరిటీ స్టాఫ్ కొట్టారని పేర్కొంది. బంజారాహిల్స్వద్ద నలుగురు వచ్చి కారులో ఎక్కించుకుని రఘురామరాజు ఇంటికి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని, దారుణంగా కొట్టారని తెలిపింది. కానిస్టేబుల్ బాషా ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. కేసు నమోదు నిజమేననీ, దర్యాప్తు జరగాల్సివుందని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. వాదనల అనంతరం క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. రఘురామరాజు న్యాయవాది కల్పించుకుని ఏదో చెప్పబోతే హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఫైన్ వేయాల్సి వస్తుందని చెప్పింది.