Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీలో కారుణ్య నియామకాలపై ఎన్‌ఎమ్‌యూ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో 8 ఏండ్ల నిరీక్షణ తర్వాత యాజమాన్యం చేపట్టిన కారుణ్య నియామకాల ప్రక్రియ పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయ్యిందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎమ్‌యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ రెగ్యులేషన్స్‌లోని రిక్రూట్మెంటు స్పూర్తి, మార్గదర్శకాలకు భిన్నంగా యాజమాన్యం సర్క్యులర్ నంబర్- పీడీ 06/2022, తేది: 4.7.2022 విడుదల చేసిందన్నారు. కారుణ్య నియమకాల్లో కనీస కనికరం, కరుణ, దయ ఏమాత్రం లేవన్నారు. 8 పేజీల సర్క్యులర్‌ను యాజమాన్య నిపుణులు పూర్తి కర్కశం, కాఠిన్యంతోనే నింపారన్నారు. ఈ సర్క్యులర్ సంస్థలోని 48వేల మంది కార్మికులను హెచ్చరిస్తున్నదని చెప్పారు. సర్క్సులర్ తొలి అనుబంధంలోని 38 అంశాలను చట్ట వ్యతిరేకంగా, సహజన్యాయ సూత్రాలకు భిన్నంగా రూపొందించారని తెలిపారు. దీనిపై కారుణ్య నియామక ఆశావహులే ఐక్యమై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. రొట్టెముక్కను అద్దంలో చూపించి, కడుపు నిండిందా? అని అడిగినట్టే కారుణ్య నియామక సర్క్యులర్ ఉన్నదని అభిప్రాయపడ్డారు. దీన్ని తక్షణం సవరించి, వారందరినీ రెగ్యులర్ ప్రాతిపదికగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.