Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలుప్రాంతాల్లో కుండపోతగా పడే అవకాశం
- పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరిక
- హైదరాబాద్లో భారీ వర్షం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చనీ, కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా కురువొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రెడ్ అలర్ట్ జాబితాలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు జిల్లాలున్నాయి. ఆరెంజ్ హెచ్చరిక జాబితాలో జగిత్యాల, మంచిర్యాల, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి తదితర జిల్లాలున్నాయి. శుక్రవారం రాత్రి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 932 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. శుక్రవారం రాత్రి పదున్నర వరకు సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో 9.75 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్ పరిధిలో ఉప్పల్లో 6.53 సెంటీమీటర్ల వాన పడింది. రాష్ట్రంలో మొత్తం మీద 9 ప్రాంతాల్లో భారీ వర్షం, 470 ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా విస్తరించింది. ఈ ఆవర్తనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది.