Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుర్రా వెంకటేశంకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ వినతి
- సానుకూలంగా స్పందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి
- ఇతర సొసైటీలతో సమానంగా సమయపాలన మార్పు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్, బీసీ గురుకుల ఉపాధ్యాయుల రాష్ట్ర సబ్‌కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఆయనతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారం పట్ల బుర్రా వెంకటేశం సానుకూల స్పందించారు. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్, బీసీ గురుకుల ఉపాధ్యాయుల రాష్ట్ర సబ్‌కమిటీ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలల సమయాలను ఇతర సొసైటీలతో సమానంగా మార్పు చేయటానికి ఆయన అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో ఉదయం 8.30 గంటలకు సిబ్బంది హాజరు కావాల్సి ఉంటే బీసీ గురుకులాల్లో మాత్రం ఉదయం 6.45 గంటలకే రావాల్సి ఉందని వివరించారు. ఉపాధ్యాయుల్లో డిప్యూటీ వార్డెన్ ఏడాది కాకుండా రెండు లేదా మూడు నెలలు ఒక్కొక్కరికి రొటేషన్ పద్ధతిలో అప్పగించేందుకు ఆయన అంగీకరించారని పేర్కొన్నారు. స్టాఫ్ నర్సు, సీనియర్ అసిస్టెంట్లకు కరస్పాండింగ్ స్కేలుతో పీఆర్సీ అమలు చేస్తామన్నారని తెలిపారు. గురుకుల ఉపాధ్యాయులకు పనిభారం దృష్ట్యా అదనపు వేతనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారని వివరించారు. విద్యార్థుల రాత్రి భోజనం సమయాన్ని సాయంత్రం 6.30 నుంచి 7.30 లేదా ఎనిమిది గంటలకు మార్చటానికి పరిశీలిస్తున్నామన్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరికీ పాఠశాలల్లో స్నేహపూర్వక పని పరిస్థితులు కల్పిస్తామన్నారని తెలిపారు. ఆదివారం పనిచేసిన ఉపాధ్యాయులకు వీక్లీఆఫ్, ఆప్షనల్ సెలవులు తదితర అంశాలపై సొసైటీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో విద్యార్థుల మెస్‌చార్జీల పెంపుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారని వివరించారు. ఉపాధ్యాయుల కృషి ఫలితంగా బీసీ గురుకులాల్లో ఇంటర్, పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. పాఠశాలల్లో అదే వాతావరణం కొనసాగించాలనీ, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుందామన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ వెంకట్, బీసీ గురుకులాల రాష్ట్ర సబ్ కమిటీ కన్వీనర్ ఎస్ సృజన, కో కన్వీనర్ జి లివిన్ స్టన్, ఆర్ మధు, సిహెచ్ సతీష్, బి రాజ్ కుమార్, వి మురళి తదితరులు పాల్గొన్నారు.