Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట్
ఈ సంవత్సరం బోనాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.15 కోట్లను మంజూరు చేసినట్టు పశుసంవర్ధక, మత్స్స్య, పాడిపరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈనెల 17న జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారం మహాంకాళి ఆలయం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలిసి బోనాలపై సమీక్ష నిర్వహించారు. 17న జరిగే మహాంకాళి బోనాలు, 18న రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహణ తదితర ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలు అంటే ఒకప్పుడు కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్‌కు మాత్రమే పరిమితమయ్యేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అవి విశ్వవ్యాప్తం అయ్యాయని చెప్పారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. రెండేండ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పెద్దఎత్తున బోనాలను నిర్వహించలేదని తెలిపారు. ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. 1500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా మరికొన్ని కెమెరాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. వాటర్ వర్క్స్ శాఖ ఆధ్వర్యంలో 6 లక్షల వాటర్ ప్యాకెట్లు, 25 వేల వాటర్ బాటిల్స్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలు ఎంతో గొప్ప పండుగ అని, దీనిని ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని చెప్పారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సీపీ సీవీ ఆనంద్, వాటర్ వర్క్స్ ఎండి.దానకిశోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి, మహంకాళి దేవాలయ ఈవో మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.