Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ మండళ్లు రద్దు చేయండి
- గుర్తింపు సంఘం న్నికలు నిర్వహించాలి : లేబర్ కమిషనర్‌కు టీఎస్ఆర్టీసీ జేఏసీ వినతి
- 23న చలో లేబర్ కమిషనర్ ఆఫీస్...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీలో ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షిస్తూ కార్మిక చట్టాలను అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసీ రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం జేఏసీ చైర్మెన్ కే రాజిరెడ్డి నేతృత్వంలో వైస్ చైర్మెన్ కే హన్మంతు ముదిరాజ్, కో కన్వీనర్లు ఎస్ సురేష్, జీ అబ్రహం, జేఏసీ సభ్యులు జీఆర్ రెడ్డి, ప్రకాష్, బీ జక్కరయ్య తదితరులు లేబర్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీలో సంక్షేమమండళ్లను రద్దు చేసి, తక్షణం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సంస్థలో గుర్తింపు సంఘం కాలపరిమితి 2018 ఆగస్టు 7తో ముగిసిందనీ, అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకుండా కార్మిక శాఖ తాత్సారం చేస్తున్నదని పేర్కొన్నారు. 2017, 2021 రెండు వేతన సవరణలు జరగాల్సి ఉందనీ, ఆరు డిఏ బకాయిలు ఉన్నాయనీ, 8 గంటల పని వేళల బదులు 12 నుంచి 18 గంటలు పనిచేయించుకుంటూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారనీ ఆ వినతిపత్రంలో తెలిపారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలను అనుమతించే విధంగా యాజమాన్యాన్ని ఆదేశించి, ట్రేడ్ యూనియన్ హక్కుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంస్థలోని పలు సమస్యల్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 23న చలో లేబర్ కమిషనర్ ఆఫీస్ ఆందోళన నిర్వహిస్తున్నట్టు తెలిపారు.