Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోని పథకాలు
- విలేకర్ల సమావేశంలో ఫెడ్ అధ్యక్షులు గంగారాం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల సమస్యలను ప్రభుత్వం తగిన రీతిలో పట్టించుకోవటం లేదని ప్రెండ్లీ ఎన్వార్మెంట్ ఫర్ ద డజేబుల్డ్(ఫెడ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మద్దెల గంగారాం, చెరుకు నాగభూషణం తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 2016 వికలాంగుల చట్టం ప్రకారం రాష్ట్రంలో వారి సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ..సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల సరిగా అమలుకు నోచుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శాఖ పనితీరుపై సమీక్షలు లేవని తెలిపారు. 1983లో ఏర్పాటు చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయటం వల్ల వికలాంగుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్వతంత్రంగా ఉంటేనే ఎక్కువగా ఉపయోగముందని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సహకార సంస్థను దశల వారిగా మూసివేసే దశకు తీసుకొచ్చారని విమర్శించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకిచ్చినట్టుగా 2008,2015,2020 పీఆర్సీతోపాటు ఇంక్రిమెంట్లు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జరిపే నియామకాలల్లో నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగులతో భర్తీ చేయాలన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖకు వెంటనే డైరెక్టర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. విలేకర్ల సమావేశంలో డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ విజయభాస్కర్, రఘునందన్, నాగభూషణం, నాగరాజు పాల్గొన్నారు.