Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన విద్యార్థులు
- న్యాయం కోసం తల్లిదండ్రులతో కలిసి వైద్య విద్యార్థుల ధర్నా
నవతెలంగాణ-మట్టెవాడ
నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) గుర్తింపు రద్దయిన మెడికల్ కళాశాలల్లో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీని ముట్టడించారు. సెక్యూరిటీ సిబ్బంది కళాశాల ఆవరణలోకి వారిని రానీయకుండా ప్రధాన గేటును మూసి వేశారు. దాంతో జోరుగా కురుస్తున్న వానను సైతం లెక్కచేయకుండా వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి యూనివర్సిటీ గేటు ముందు రోడ్డుపై బైటాయించారు. ప్రభుత్వం తమ పిల్లలకి న్యాయం చేయాలని, వెంటనే వేరే వైద్య కళాశాలలో రి అలాట్మెంట్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఎన్ఎంసీ ఉద్దేశించిన షరతులకు లోబడి వైద్య విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, ల్యాబ్, ఫ్యాకల్టీలు తదితర సదుపాయాలు లేవన్న కారణంతో రాష్ట్రంలోని వికారాబాద్‌లో ఉన్న మహావీర్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీ, పటాన్‌చెరులోని టీఆర్అర్ మెడికల్ కాలేజీల గుర్తింపును మే 18న రద్దు చేసినట్టు తెలిపారు.
ఆయా కళాశాలల్లో యూజీ మొదటి సంవత్సరం చదువుతున్న 450మంది వైద్య విద్యార్థులు, 100 మంది పీజీలు.. భవిష్యత్తును యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ అకాడమిక్ ఇయర్లో కళాశాలకు, క్లాసులకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యూనివర్సిటీ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో మట్టేవాడ పోలీసులు యూనివర్సిటీకి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు కోల్పోతున్నా ప్రభుత్వం, యూనివర్సిటీ వీసీ, అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు : వైద్య విద్యార్థి తండ్రి నరిగే మొగిలి
దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో అర్హత పొంది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సిలింగ్ ద్వారా మెడికల్ కాలేజీలో సీటు పొందిన నా కొడుకు రెండు నెలలు గడవకముందే ఇంటికి వచ్చాడు. మెడికల్ కళాశాల గుర్తింపును ఎన్ఎమ్సీ రద్దు చేసింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు సీట్లు కోల్పోయిన విద్యార్థులను వేరే కళాశాలలో సర్దుబాటు చేయమని తెలంగాణ ప్రభుత్వానికి, కేఎన్ఆర్యూ యూనివర్సిటీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినా జాప్యం చేస్తున్నారు. రెండు మూడు సార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మెమోరాండం ఇచ్చినా పట్టించుకోలేదు. వైద్య విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలి.