Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ కార్యాలయంలో నోటీసు అందజేసిన జేఏసీ
- పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఇచ్చిన పేస్కేలు, వారసత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, తదితర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25నుంచి సమ్మెలోకి వెళ్లబోతున్నట్టు వీఆర్ఏ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని భూపరిపాలనా కార్యాలయం (సీసీఎల్ఏ)లో ఉన్నతాధికారులకు సమ్మె నోటీసును జేఏసీ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మెన్ ఎం.రాజయ్య, కో-చైర్మెన్ రమేశ్బహుదూర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే దాదేమియా, కన్వీనర్ డి.సాయన్న, కో-కన్వీనర్లు వంగూరు రాములు, ఎస్కే మహమ్మద్ రఫీ, వై.వెంకటేశ్‌యాదవ్, ఎస్.గోవింద్, కంది శిరీషరెడ్డి, వై.సునీత, నాయకులు శ్రీధర్, గైనీదయాసాగర్, శ్రీనివాస్, కె.మాధవ్నాయుడు, ఎస్కే అజీజ్, కె.నర్సింహ్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పేస్కేలు జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలివ్వాలనీ, వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని విన్నవించారు. మరణించిన వీఆర్ఏలకు చెందిన కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 24వేల మంది వీఆర్ఏలలో నూటికి 90 శాతం మంది సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన దళిత సామాజిక తరగతికి చెందిన వారేనని తెలిపారు. నిత్యావసరాల పెరుగుదల, మరోవైపు అత్తెసరు జీతాలతో వీఆర్ఏల కుటుంబాలు అర్ధాకలితో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. అప్పుల బాధతో చాలా మంది వీఆర్ఏలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోరికలు తీర్చమనట్లేదనీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. పలుమార్లు ప్రభుత్వానికి, రెవెన్యూ ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు, తహసీల్దార్లకు ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలేదని విమర్శించారు. మే 21న చలో హైదరాబాద్‌కు వీఆర్ఏలు పిలుపునిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.