Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఆర్వో జేఏసీ చైర్మెన్‌గా గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శిగా హరాలే సుధాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులకు తాము దూరంగా ఉంటామని వీఆర్వో సంఘాల జేఏసీ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల కీలక సమావేశం జరిగింది. తమ సమస్యలపై ఐక్యంగా పోరాడాలని అన్ని సంఘాలూ ముక్తకంఠంతో నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగానే జేఏసీగా ఏర్పడ్డాయి. వీఆర్వోల జేఏసీ చైర్మెన్‌గా గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శిగా హరాలే సుధాకర్, కన్వీనర్‌గా వింజమూరు ఈశ్వర్, కో-చైర్మెన్లుగా జె.రవినాయక్, ప్రతిభ, వైస్చైర్మెన్లుగా షేక్మౌలానా, కె.భిక్షపతి, చింతల మురళి, పి.సురేశ్‌బాబు, పి చెన్నరాజు, అడిషనల్ జనరల్‌గా పల్లేపాటి నరేష్. కో కన్వీనర్లుగా రాజవర్ధన్‌రెడ్డి, కృష్ణమార్తి, పగిల్ల వెంకన్న, వైస్ చైర్మన్లుగా సర్వేశ్, ఆశన్న, సుధీర్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కృష్ణగౌడ్, రమేష్ పెద్దాపురం, బి శ్రవణ్‌గౌడ్, వినరు, డి.శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోల్కొండ సతీశ్, హరాలే సుధాకర్, వింజమూరు ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. వీఆర్వో వ్యవస్థను రద్దయి 22 నెలలు గడుస్తున్నా తమను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని వాపోయారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అనేకసార్లు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 22 నెలల నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో చనిపోయినటువంటి దాదాపు 200 మంది వీఆర్వోల కుటుంబాలు రోడ్డున పడ్డాయనీ, కుటుంబాన్ని పోషించుకోలేక ఏమి చేయాలో తోచని స్థితిలో బాధిత కుటుంబాలు ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కారుణ్య నియామకాలు చేపట్ట లేకపోవడం అమానుషమని తెలిపారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, శాఖపరమైన పరీక్షలు రాయనివ్వకుండా చేయడం దారుణమని విమర్శించారు. తమ వ్యవస్థను రద్దు చేసే సమయంలో భూములకు సంబంధించిన విధులను నిర్వహించొద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. మళ్లీ రెవెన్యూ సదస్సులలో భూ సంబంధిత సమస్యలను ప్రజల ద్వారా వచ్చే వినతి పత్రాలను స్వీకరించి పరిష్కరించాలని కలెక్టర్లు వీఆర్వోలకు ఆదేశించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రెవెన్యూ సదస్సుల్లో తమను భాగస్వామ్యం చేయొద్దని కోరారు. వాటికి తాము దూరంగా ఉండబోతున్నామని ప్రకటించారు.