Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ, గిరిజనులపై అక్రమ కేసులను ఎత్తేయాలి
- బాధ్యులైన అధికారులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
- పోడుసాగుదార్లందరికీ వెంటనే హక్కుపత్రాలివ్వాలి: సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీ గిరిజన మహిళలపై అటవీ, పోలీసు అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని కోరారు. దానికి బాధ్యులైన అధికారులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం 2014వరకు సాగులో ఉన్న పోడుదారులందరికీ వెంటనే హక్కుపత్రాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో పోడురైతులకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏండ్ల తరబడి భూమిని నమ్ముకుని బతుకుతున్న పోడు రైతులు వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. గురు, శుక్రవారాల్లో మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఏండ్ల తరబడి పోడు చేసుకుంటున్న 48 ఆదివాసీ గిరిజన కుటుంబాలపై వందలాది మంది అటవీ అధికారులు, పోలీసులు మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ ఘటనా ప్రాంతాన్ని తమ పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవితోపాటు కనికరపు అశోక్, బండారు రవికుమార్, పి ఆశయ్య, బి పద్మ నాయకత్వంలో రాష్ట్ర బృందం శుక్రవారం పర్యటించిందని తెలిపారు. బాధితులను పరామర్శించి అక్కడి పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి, వారితో మాట్లాడి వాస్తవాలను తెలుసుకున్నదని వివరించారు. ఆ అంశాలన్నింటినీ సీఎం దృష్టికి తెస్తున్నామని తెలిపారు.
సభ్యసమాజం తలదించుకునేలా దాడులు...
2002 నాటికే వారు పోడు చేసుకుంటున్న భూముల్లో గుడిసెలు వేసుకుంటే వాటిని తొలగించి నిలువనీడ లేకుండా చేశారని తమ్మినేని విమర్శించారు. తినే తిండిని సైతం నేలపాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దుప్పట్లు, బట్టలు కాల్చివేశారని పేర్కొన్నారు. చిన్నపిల్లలు, తల్లులను బట్టలూడిపోయేలా కొట్టి, పోలీస్ వ్యానుల్లో పడేసి వారిని ఆస్పత్రుల పాలు చేశారని తెలిపారు. బైండోవర్, అక్రమ అరెస్టులు, కేసులు పెట్టి పచ్చిబాలింతలనూ జైళ్లకు పంపారని పేర్కొన్నారు. అయినా గత్యంతరం లేక గత నాలుగైదు రోజులుగా వర్షంలోనే ఈ అమాయక ఆదివాసీ, గిరిజనులు అటవీ అధికారులు, పోలీసులు కూల్చేసిన గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తున్నారని వివరించారు. అటవీ, పోలీసు అధికారుల దాడులు సభ్యసమాజం తలదించు కునేలా ఉన్నాయని విమర్శించారు. ఇది తెలంగాణ సమాజానికి తలవంపులు తెచ్చేదిగా ఉందని తెలిపారు. శుక్రవారం బాధిత మహిళలు దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేటికీ వారి దరఖాస్తుకు రశీదు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేంజ్ ఆఫీసులో రేంజర్ రత్నాకర్‌రావు పెట్టిన చిత్రహింసల వల్ల గాయాలపాలైనవారిని అస్పత్రికి పంపలేదని తెలిపారు. నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు.
ఆదివాసీ గిరిజనులను అడవుల నుంచి తరిమికొట్టే కుట్ర
అటవీశాఖ వారు పోలీసులతో కలిసి ఆదివాసీ గిరిజన రైతులపై కక్షపూరిత వైఖరితో ఈ దాడులు చేయిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో తమ పర్యటన సందర్భంగా వ్యక్తమైందని తమ్మినేని తెలిపారు. రాష్ట్రం వస్తే తమపై దౌర్జన్యాలు, దాడులు ఆగుతాయనీ, ఏండ్ల తరబడి తాము పోడు చేసుకుని పొట్టపోసుకుంటున్న భూములకు హక్కులు వస్తాయనీ, ఆదివాసీ గిరిజనులు ఆశపడ్డారని గుర్తు చేశారు. కానీ వారికి నిరాశే మిగులుతున్నదని ఆందోళన వ్యక్తం చేశా రు. 2018 ఎన్నికలప్పుడు ప్రతి ఏజెన్సీ నియోజక వర్గానికీ సీఎం కేసీఆర్ స్వయంగా హాజరై సమస్యను పరిష్కరిస్తా మంటూ అనేక సార్లు వాగ్దానం చేశారని తెలిపారు. పోడు భూముల్లోకి స్వయంగా వెళ్లి, గిరిజన కుటుంబాలకు భూ హక్కు పత్రాలిస్తామని ముఖ్యమంత్రి హోదాలోనూ 2019, జులై 19న అసెంబ్లీ సాక్షిగా సీఎం మాట ఇచ్చారని గుర్తు చేశారు. 2021, నవంబర్ ఎనిమిది నుంచి 30 వరకు పోడు సాగుదార్ల నుంచి దరఖాస్తులనూ స్వీకరించారని పేర్కొన్నారు. కానీ నేటికీ హక్కుపత్రాలివ్వకపోగా, నేడు కోయపోషగూడెంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా పోడు చేసు కుంటున్న అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులతో దౌర్జన్యాలు, దమనకాండ, దాడులు చేయిస్తు న్నారని విమర్శించారు. ఆదివాసీలపై అక్రమ కేసులు బనాయించి బాలింతలనీ చూడకుండా జైళ్లకు పంపుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆదివాసీలను, గిరిజనులను అడవుల నుంచి తరిమికొట్టి, కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అడవులను గంపగుత్తగా కట్టబెట్టే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావొద్దని కోరారు.
హక్కుపత్రాలిచ్చి శాశ్వత పరిష్కారం చూపాలి
2014 నాటికి సాగులో ఉన్నవారందరికీ హక్కుపత్రా లిచ్చి ఆదుకుంటామన్న హామీ అమలు జరపకపోవడంతో ఇలాంటి దురాఘతాలు చోటుచేసుకుంటున్నాయని తమ్మినేని తెలిపారు. కోయపోషగూడెం ఆదివాసీ గిరిజనులు 2002కు ముందే సాగులో ఉన్నందున వారికి హక్కుపత్రా లివ్వాలనీ, వారిపై అటవీ అధికారులు, పోలీసుల దాడులను ఆపి, అక్రమ కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
దాడుల్లో గాయపడిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలనీ, ఈ దాడిలో పాల్గొన్న అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్వీకరించిన పోడు దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపాదికన గిరిజన సంక్షేమశాఖ నోడల్ ఏజెన్సీగా రెవెన్యూ, అటవీశాఖల సమన్వయంతో పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. హక్కుదార్లను గుర్తించాలనీ, అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ కమిటీలదే అంతిమ నిర్ణయా ధికారంగా వారికి హక్కుపత్రాలివ్వాలను ఇచ్చి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సూచించారు.