Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు డిక్లరేషన్ మాదిరిగానే నిరుద్యోగులకు హామీ
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో ఆగస్టు నెలలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందనీ, రైతు డిక్లరేషన్ మాదిరిగానే నిరుద్యోగులకు హామీనిస్తూ డిక్లరేషన్ చేసి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరుస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రకటించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. రైతు రచ్చబండ ద్వారా ప్రజల్లోకి వెళ్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించామనీ, కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ఆవశ్యకతను నొక్కి చెప్పామని తెలిపారు. రాష్ట్రంలో రోజుకు సగటున ముగ్గురు రైతులు, ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ..ఎంఐఎం..టీఆర్ఎస్ ఒక్కటే : మధుయాష్కీగౌడ్
బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేననీ, పైకి నటిస్తున్నా అవి మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు జరిగినా హైదరాబాద్‌తోనే లింక్ ఉంటుందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లో జరిగిన ఘటనలలో నిందితులకి బీజేపీ వాళ్లతో లింకులు ఉన్నాయని చెప్పారు. లస్కరే తోయిబా లింకులన్నీ హైదరాబాదులోనే ఉన్నాయనీ, వాటి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.