Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ మహిళలపై దాడులకు పాల్పడిన అటవీ అధికారులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల గుడిసెలను ద్వంసం చేసి, వారు తినే అన్నాన్ని బురదలో పడేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా డండెపల్లి మండలం కోయపోచ గూడెం ఆదివాసి గిరిజనులు గుడిసెలు వేసుకుని పోడుభూములను సాగు చేసుకుంటుంటే గురువారం అటవీ శాఖ అధికారులు పోలీసు సిబ్బంది గుడిసెలను తొలగించటం, అడ్డువచ్చిన మహిళలపట్ల అమానుషంగా వ్యవహరించటం తగదని పేర్కొన్నారు. విచక్షణ లేకుండా ఈడ్చుకుంటూ లాక్కుపోయారని తెలిపారు. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అమాయక గిరిజన మహిళలను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. పోడు భూముల సమస్య ఎక్కడున్నా పరిష్కరిస్తానన్న సీఎం కేసీఆర్ స్పంధించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పిన మాటలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. అటవి హక్కుల చట్టం 2006 ప్రకారం పోడు సాగు దారులందరికి హక్కు పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు.