Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు
నవతెలంగాణ-వనస్థలిపురం
ఓ వివాహితపై లైంగికదాడి చేయడమేగాక.. ఆమె భర్తపై కూడా దాడి చేసినట్టు ఫిర్యాదు, ఆరోపణల నేపథ్యంలో మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు, ఆమె భర్తను మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గతంలో తన పొలంలో పనికి కుదుర్చుకున్నాడు. ఈ సమయంలో తీవ్రంగా వేధించాడు. అయితే, ఈనెల 7న బాధిత మహిళను ఇన్స్పెక్టర్ కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత బాధితురాలని, ఆమె భర్తను తుపాకి చూపించి నగరం విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇద్దరినీ ఊర్లో వదిలేసి వస్తానని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో తప్పించుకున్న బాధితురాలు, ఆమె భర్త పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీఐ నాగేశ్వరరావు తన తలపై తుపాకితో కొట్టి గాయపర్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. లైంగికదాడి, ఆయుధ చట్టం కింద నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన నాగేశ్వరరావుకు ఎన్నో సంచలన కేసులు ఛేదించిన రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే తన టీమ్‌తో బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ మింక్ పబ్‌లో డెకారు ఆపరేషన్ నిర్వహించి సంచలనం రేపారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదని భావించిన ఉన్నతాధికారులు బంజారాహిల్స్ సీఐ శివచంద్రను బదిలీ చేసి ఆయన స్థానంలో నాగేశ్వరరావును కొత్త సీఐగా నియమించారు. ఆ కేసు విచారణలో ఎంతో పేరు తెచ్చుకున్న నాగేశ్వరరావు లైంగికదాడి కేసులో ఇరుక్కోవడం కలకలం రేపుతోంది. మహిళను కిడ్నాప్, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్టు సీపీ కార్యాలయం వెల్లడించింది.