Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలుకుంటున్న వారు తక్కువ
- ఐదు వేలు దాటిన యాక్టివ్ కేసులు
- జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న డాక్టర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో దాని నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటున్నది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. పాజిటివ్ రేటు రెండు నుంచి మూడు శాతం మధ్యలో నమోదవుతున్నది. గత కొన్ని రోజుల నుంచి క్రమక్రమంగా ఈ పెరుగుదల కనిపిస్తున్నది. ఒమిక్రాన్ లో వచ్చిన కొత్త వేరియంట్లే ఈ వ్యాప్తికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దశలో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉండటం ఉపశమనం కలిగిస్తున్నది. అదే సమయంలో మరణాలు లేకపోవడం ఊరటనిచ్చే విషయం. అయినప్పటికీ మహమ్మారి విషయంలో నిర్లప్తంగా ఉండరాదనీ, అప్రమత్తత అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
గత వారం రోజుల్లో రాష్ట్రంలో 3,731 కేసులు నమోదు కాగా, 3,287 మంది కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. అంటే వారంలో యాక్టివ్ కేసుల సంఖ్య 444 పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసులు 5,146కు చేరాయి. ఈ నెల ఐదున 552 కేసులొస్తే, 496 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. 6న 563 మందిలో వైరస్ బయట పడగా 434 మంది దాని నుంచి బయటపడ్డారు. ఏడున 592 మంది కరోనా బారిన పడినట్టు పరీక్షల్లో వెల్లడి కాగా 477 మంది డిశ్చార్జి అయ్యారు. శుక్రవారం కొత్త కేసులు 608కి గాను కోలుకున్నవారు 459 మంది మాత్రమే. ఈ లెక్కన రాబోయే కొన్ని వారాల పాటు ఈ పెరుగుదల ఇలాగే ఉండొచ్చని భావిస్తున్నారు.
హైరిస్క్ వారు జాగ్రత్తగా ఉండాలి...
డాక్టర్ కిరణ్ మాదాల
ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ల పట్ల హైరిస్క్ గ్రూపుకు చెందిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కిరణ్ మాదాల సూచించారు. 60 ఏండ్లు పైబడిన వారు, గర్భిణులు, రెండు దీర్ఘకాలిక వ్యాధులున్న వారు,రోగ నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నవారికే ప్రస్తుతం ఐసోలేషన్ నిబంధనలున్నాయని చెప్పారు. వీరిలోనూ వ్యాక్సిన్ వేసుకొని 90 రోజులు దాటితే వారి పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కేసుల్లో 92 శాతం ఒమిక్రాన్ వేననీ, ఇప్పటికే 67 శాతం మందిలో యాంటీబాడీలు వచ్చాయని తెలిపారు. జలుబు, జ్వరం, గొంతులో గరగర వంటి లక్షణాలు ఉంటున్నాయనీ, కొంత మందిలో తలనొప్పి వస్తుందన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.