Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
- రెవెన్యూ సదస్సులు వాయిదా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. భారీ వానలు వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్కు తీసుకోవద్దనీ, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలనీ, తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో విజ్జప్తి చేశారు. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్ల సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించాలనీ, వరద ముంపు ప్రాంతాలల్లోని అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ విధించిన నేపథ్యంలో తాను పరిస్థితులను ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూంటానని పరిస్థితులను బట్టి నేడో, రేపో వీడియో కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తానని తెలిపారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా వుండాలన్నారు.
రెవెన్యూ సదస్సులు వాయిదా
భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11న ప్రగతి భవన్లో నిర్వహించ తలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల 'రెవిన్యూ సదస్సుల అవగాహన' సమావేశంతోపాటు జూన్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించతలపెట్టిన 'రెవిన్యూ సదస్సులను' వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.