Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసమర్థ ప్రధాని నరేంద్రమోడీ
- రూపాయి పతనం...ద్రవ్యోల్బణం పెరుగుదలపై మాట్లాడరేం?
- దమ్ముంటే ఏక్‌నాథ్‌షిండేలను తెండి...చూస్తాం
- మతపిచ్చి రాజకీయాలు దేశానికే ప్రమాదం
- సైన్యాన్నీ వదలట్లేదు..
- ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పకుండా తోకముడిచారు
- కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
కేంద్రంలో ప్రజాస్వామ్య హంతక ప్రభుత్వం ఉన్నదనీ, దాన్ని చూస్తూ ఊరుకోబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హెచ్చరించారు. దేశ చరిత్రలోనే నరేంద్రమోడీ అంతటి అసమర్థ ప్రధాని ఎవరూ లేరనీ, ఆయన వల్ల ఈ దేశానికి ఒనగూరే ప్రయోజనం ఏమీలేదన్నారు. గడచిన 8 ఏండ్ల ఆయన పాలనలో ఈ విషయం తేలిపోయిందని చెప్పారు. ప్రజలంతా మెచ్చుకొనే ఒక్క మంచి పని కూడా ఆయన పాలనలో జరగలేదన్నారు. అలాంటప్పుడు ఉత్సవ విగ్రహంలా ప్రధాని సీట్లో ఆయన ఎందుకుండాలని ప్రశ్నించారు. ఆదివారంనాడిక్కడ ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు.అసలు ఆయన దగ్గర సమాధానాలే ఉండవని రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అప్పుడే చెప్పారని గుర్తుచేశారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్డం, పొడుగు ఏది పడితే అది మాట్లాడితే చెల్లదన్నారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామనీ, ప్రజలకూ వివరించి, ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతామని చెప్పారు. గ్యాస్‌సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1200లకు పెంచారనీ, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు కేంద్రప్రభుత్వ తప్పుడు విధాన నిర్ణయాలే కారణమని విమర్శించారు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదలపై ప్రధాని ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, అడిగే ప్రశ్నలకు సమాధానాలే లేకే ఆయన మౌనంగా ఉంటున్నారని అన్నారు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలతో పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియా పచ్చి అబద్ధమని చెప్పారు. దీపావళి టపాసులు, పతంగులు, జాతీయ పతాకాలు, గణపతి విగ్రహాలు చైనా నుంచి వస్తున్నాయని గుర్తుచేశారు. దేశంలో 38 శాతం పరిశ్రమలు మూతపడ్డాయనీ, ఇంకెక్కడి మేకిన్ ఇండియా అని ఎద్దేవా చేశారు. దేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ సర్వనాశనం చేస్తున్నారనీ, కేవలం బీజేపీయేతర ప్రభుత్వాల్ని తిప్పలు పెట్టడంపై ఉన్న శ్రద్ధ పాలనపై పెడితే బాగుండేదని చెప్పారు. పాత అప్పులను లెక్కించి ఎఫ్ఆర్బీఎంలో కోతలు పెడుతున్నారన్నారు. దేశ ఆర్థిక భవిష్యత్తును సర్వనాశనం చేస్తూ కేంద్రంలో వికత రాజకీయ క్రీడ కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. చివరకు మోడీ ప్రభుత్వం సైన్యాన్ని కూడా వదలట్లేదన్నారు. అక్కడా రాజకీయాలను చొప్పిస్తున్నదనీ, యువకుల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నదన్నారు. దేశంలోని 130 కోట్ల జనాభాను మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నూకలు తినమంటూ తెలంగాణ రైతులను అవమానించేలా వ్యాఖ్యానించారన్నారు. కేంద్రంలో పంటలకు సంబంధించి అసలు ఏదైనా విధానం అంటూ ఉందా అని ప్రశ్నించారు. రావణాసురుడు, దుర్యోధనుడు, కంసుడు, నరకాసురుడు వంటి రాక్షసులు ఎందరో పోయారు మీరు అంతకంటే గొప్పోళ్లా... వీళ్లూ అంతే పోతారు...అని విమర్శించారు. దేశంలోని రైతులకు రైతు బీమా ఇచ్చే తెలివి కూడా కేంద్రప్రభుత్వానికి లేదన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తిన్నది అరక్క ఛస్తున్నరు అని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాఖ్యానిస్తున్నారనీ, రైతులు ధర్నాలు చేస్తే జీపులు ఎక్కించి తొక్కి చంపుతున్నరని చెప్పారు. ఇంతటి అహంకారం ఎందుకని ప్రశ్నించారు. రైతులు 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తే ఖలిస్థాన్ ఉగ్రవాదులు అని నిందలు వేస్తారా...అసలు మీది పరిపాలనా? ప్రభుత్వమేనా? ఎన్నికలు రాగానే మళ్లీ తలవంచి 'మాఫీ చాతాహు' అని క్షమాపణ వేడుకుంటారా? ఉగ్రవాదులైతే ఎందుకు క్షమించమని అడిగారు? ప్రజలకు సమాధానం చెప్పాలి' అంటూ ప్రధాని నరేంద్రమోడీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలోని మోడీకి భయపడేవారు ఎవరూ ఇక్కడ లేరని తేల్చిచెప్పారు.
తెలివి లేదని కిసాన్ మోర్చానే చెప్పింది..
కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదని బీజేపీ కిసాన్ మోర్చానే చెప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. 'నిన్నగాక మొన్న రారుపూర్‌లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సమావేశం పెట్టింది. మా కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేదు. రెండు మంత్రిత్వ శాఖలు వాణిజ్య శాఖ, వ్యవసాయశాఖకు అసలు సమన్వయమే లేదు. ఎప్పుడు ఎగుమతులు రద్దు చేయాలో, ఇప్పుడు దిగుమతులు చేసుకోవాలో కూడా తెలియట్లేదు. దానివల్ల రైతులను ముంచుతున్నరు. దేశాన్ని నాశనం చేస్తున్నరు'' అని చెప్పింది. ప్రధాని మోడీ అసమర్థతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. హిందూ పత్రిక ఎన్. రామ్, ఎన్డీటీవీ ప్రణరురారు ఎక్కడో ఊటిలో సమావేశం పెడితే వారిని నక్సలైట్లు అంటూ ఫొటోలు పెట్టారు.. ఇదెక్కడి అన్యాయం. మీరు ఎవరినీ వదలరా? జర్నలిస్టులు మీకు నక్సలైట్లు లాగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు.
కండ్లు నెత్తికెక్కారు...
బీజేపీ నేతలకు కండ్లు నెత్తికెక్కాయి. ఎవరైనా ఏక్నాథ్ షిండేలను సష్టిస్తామని మాట్లాడుతారా? ఇది ప్రజాస్వామ్యానికి అలంకారమా? భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇంత ఘోరంగా హత్య చేస్తారా? మీరు ప్రజాస్వామ్య హంతకులుకారా? ఇదేం అన్యాయం. మీ ఉన్మాదం, పిచ్చి ఎక్కడి వరకు వెళ్తున్నది. ఇంకా దుర్మార్గంగా సుప్రీం కోర్టు అంటే కూడా లక్ష్యం లేదు.
వరి వెయ్యాలట!
నిన్న మొన్నటి వరకు వరి వద్దన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇప్పుడు దాన్నే వేయించండి అంటున్నాడు. అసలు మీకు పంటలపై ఒక విధానం అంటూ ఉందా? జాతీయ- అంతర్జాతీయ మార్కెట్‌పై అవగాహన ఉందా? ఏం జరుగుతున్నదో అంచనాలున్నాయా? ఏం లేదు అంతా డొల్లే.
మార్పు రావాలి...
దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్న బీజేపీని సముద్రంలోకి విసిరేయాల్సిందేనని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. దానికోసం దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావల్పిందేననీ, దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నామన్నారు. అవసరమైతే జాతీయ పార్టీ పెడతామన్నారు. ఫ్రంటులు పెట్టి లాభం లేదన్నారు. మొదట ప్రజల్ని జాగృతం చేయాలన్నారు.
హిపోక్రసీకీ హద్దుంది...
కశ్మీర్ ఫైల్స్ అంటూ సినీమా తీసి, జనంలోకి వదిలారు. ఇప్పుడక్కడ ఏం జరుగుతుంది...కాశ్మీరీ పండిట్లు రోజూ అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ దీనిపై మౌనంగా ఉంటారు. దేశంలో ఏం జరుగుతున్నదో కనీసం ఆపార్టీ నేతలకైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న అందోళనలను ప్రస్తావించారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట దిగజారుగుతున్నని ఆందోళన వక్తం చేశారు. కేంద్రంలో తప్పకుండా మోడీ సర్కారును మారుస్తామనీ, ఎల్ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మనీయబోమని చెప్పారు. ఉద్యమ నాయకుడిగా తానెవరికీ భయపడబోనన్నారు.
పోతే...భయపడం
ఏక్నాథ్ షిండేలు, ఆపరేషన్ ఆకర్ష్‌లు అంటే భయపడేది లేదు. వాళ్ల గ్రహచారం బాలేక ఓ ఐదు, పదిమంది ఎమ్మెల్యేలు పోయినా బాధపడేది లేదు. వాళ్ల స్థానంలో మరో కొత్త నాయకులు వచ్చి గెలుస్తారు. అయినా ప్రజలు ఎవర్ని ఆశీర్వదిస్తే వాళ్లు ప్రభుత్వంలో ఉంటారు. లేకుంటే ప్రజాతీర్పును గౌరవిస్తూ, వాళ్లు ఏం చేయమంటే అది చేస్తారు. న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రభుత్వాలను మార్చేది బీజేపీ కాదు. వాళ్ల ఉడుత ఊపులకు భయపడేదే లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కరరావు రూపంలో ఇలాంటి ఏక్నాథ్ షిండేలు వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందే తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ఆ షిండేలు వస్తే...మాక్కూడా చేతినిండా పని ఉంటుంది. రమ్మనండి చూద్దాం...కేంద్రం మాతో గోక్కుంటే మాకు పోయేదేం లేదు...వాళ్లకే నష్టం...నేను మాత్రం వాళ్లను గోకుతూనే ఉంటా' అని సీఎం కేసీఆర్ అన్నారు.