Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరోవైపు కోవిడ్-19 కేసులు
- సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ
- నివారణ చర్యలపైన ఫోకస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వరుసగా కురుస్తున్న వర్షాలతోపాటు సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అదే సమయంలో కరోనా కేసులు కూడా గత 10 రోజుల నుంచి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. లక్షణాలు కనిపించిన వెంటనే ఆయా వ్యాధులను నిర్దారించుకుని చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో వైరల్ ఫీవర్లు, జలుబు (ఫ్లూ), అప్పర్ రెస్పిరేటరీ సిండ్రోమ్తోపాటు కోవిడ్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో వస్తున్న వాటిలో 35శాతం సాధారణ జలుబు, వైరల్ ఫీవర్, కోవిడ్-19 ఉండగా, 15శాతం డెంగ్యూ కేసులున్నాయి. ఈసారి 10 హెపటైటీస్ ఏ కేసులు రావడం గమనార్హం. మిగతా 40శాతం ఇతర వైరల్ ఫీవర్లు ఉన్నాయి. హెపటైటీస్‌ను నిర్లక్ష్యం చేస్తే ముదిరి కామెర్లు (జాండీస్)గా మారుతుంది. జిల్లాల్లో ఇప్పుడిిప్పుడే డెంగ్యూ కేసులు వస్తున్నట్టు తెలుస్తున్నది. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఐదుశాతం వరకు ఉంటున్నట్టు సమాచారం. రాబోయే కాలంలో సీజనల్ వ్యాధులు, కోవిడ్-19 కేసుల నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.
ఆయా వ్యాధులను లక్షణాలను బట్టి గుర్తు పెట్టుకోవాలి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటే డెంగ్యూ పరీక్ష చేయించుకోవాలి. కొద్దిగా విరేచనాలు, ముక్కు కారడం, గొంతులో గరగర ఉంటే కరోనా అయ్యే అవకాశమున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స విషయంలో డెంగ్యూ, కరోనాకు వేరు వేరుగా చేయాల్సి ఉంటుంది. స్ట్టెరాయిడ్స్ వాడే ముందు ప్లేట్ లెట్ల కౌంట్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు వ్యాధులు ఒకేసారి కూడా వచ్చే అవకాశముంది. దీంతో పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ నెల మొదటి వారంలో సర్వే మొదలు పెట్టింది. ఈనెల 18న ముగియనున్నది. ఇందులో ఇంటా, బయటా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, లార్వా ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 12 శాతం ఇండ్లలో నీరు నిల్వ ఉంటున్నట్టు గుర్తించారు. వాటిని తొలగించడం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. దోమతెరలపై అవగాహన కల్పిస్తున్నారు.
నీటి కాలుష్యంతో
హైదరాబాద్‌లో బయటి ఆహారం తీసుకుంటున్న వారు ఎక్కువగా హెపటైటీస్ బారిన పడుతున్నట్టు తెలుస్తున్నది. నీటి కాలుష్యంతో దీని బారిన పడుతున్నట్టు తెలుస్తున్నది. గతంలో ఎప్పుడులేని విధంగా సీజనల్ వ్యాధుల కేసుల్లో 10 ఇవే ఉంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ప్రజలు ఇంట్లో కాచి వడబోసిన నీటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యనిపుణుల సలహా. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటూ నీరు, ఆహారం ఇవ్వాలని పీడియాట్రిషియన్లు సూచిస్తున్నారు.