Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి
- వర్షాలతో ప్రాణనష్టం జరగకుండా చూడాలి
- జనజీవనానికి ఆటంకాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలి
- అంటువ్యాధులు ప్రబలకుండా దృష్టి సారించాలి
- భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికీ సోమ, మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఎడతెరపి లేకుండా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలనీ, జనజీవనానికి ఆటంకాలను వీలైనంత మేరకు తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. ప్రజలు కూడా అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో వర్షాలపై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యామ్‌లు, రిజర్వాయర్లలోని నీటిమట్టాల గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా శాఖలు అప్రమత్తంగా ఉండాలనీ, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లపై జనసంచారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీపై అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేసి, ప్రతి ఆరు గంటలకోసారి జిల్లా కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. ఏటూరు నాగారం, రామన్నగూడెం ప్రాంతాల వరద ముంపు అధికంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలున్నాయనే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం కావాలని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ తీగలు తెగిపడటం, పాత గోడలు కూలడం వంటి ప్రమాదాలను పసిగట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి వరద ప్రవాహం ఎక్కువగా ఉండే దారులలో (కాజ్‌వేలు) ప్రమాద హెచ్చరిక సూచనలను ఏర్పాటు చేయాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు చూడాలని ఆదేశించారు. వరద ముంపు అధికంగా ఉన్న భూపాలపల్లి, కొత్తగూడెం, నిజామాబాద్ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. విద్యుత్, తాగునీటికి అంతరాయాలు కలుగుకుండా చూసుకోవాల న్నారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లలో వరద పెరిగే అవకాశమున్నందున నీటి విడుదల చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పి.సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సెలవులపై ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ, యూనివర్సిటీలు
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సోమ, మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మూడు రోజులు పాటు జరిగే పరీక్షలను, క్లాసులను వాయిదా వేస్తున్నట్టు వీసీ ప్రకటించారు.
త్వరలో రీషెడ్యూల్ వెల్లడిస్తామని తెలిపారు. మిగతా యూనివర్సిటీలు కూడా సెలవుల ప్రకటన చేశాయి. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 11,12,13 తేదీల్లో అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు.