Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక
- ప్రాజెక్టులకు పోటెత్తిన వరదనీరు
- అప్రమత్తమైన అధికారులు
- లోతట్టుప్రాంతాలపై దృష్టి
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి ఉరకలేస్తోంది. గత జులైతో పోల్చుకుంటే ఈ ఏడాది రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు ఇలాగే వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ తెలుపుతోంది. దాంతో అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్టు సమాచారం. మూడు రోజుల పాటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా కొందుర్గులో 56.4మీమీ , అత్యల్పంగా 13.6మీమీ వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో రోడ్లపై అడ్డంగా చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం చెర్లతండాకు చెందిన తుల్చియా ఇల్లు కూలిపోయింది. బషీరాబాద్ మండలం బాబునాయక్ తండాలో విఠల్‌కు చెందిన ఇల్లు కూలిపోయింది. యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని భీమలింగ కత్వా వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తోంది.
నల్లగొండ జిల్లాలోని చండూరు, మర్రిగూడ, నార్కట్‌పల్లి, చిట్యాల, తదితర మండలాల్లో వర్షం పడింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ఎస్ మండలకేంద్రంలోని మహ్మాత్మాగాంధీ జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలోని తరగతిగదుల్లోకి వర్షం నీరు చేరడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్ జి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వారం రోజుల్లో తరగతి గదుల్లో వర్షం నీరు రాకుండా మరమ్మతులు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు-లక్ష్మీపురం గ్రామాల మధ్య ఉన్న చెరువు అలుగు పడుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు మీదున్న రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. మల్హర్ మండలంలోని వాగులో గొర్రెలు, కాపరులు చిక్కుకోగా కొయ్యూర్ పోలీసులు రక్షించారు. అయినప్పటికీ 4 గొర్రెలు మృతి చెందాయి. అలాగే కాకతీయ సప్తాహం ఉత్సవాలను వాయిదా వేస్తున్నట్టు హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రకటించారు. వర్షాల వల్ల ఇల్లు కూలి ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని గాంధీనగర్‌కు చెందిన జయమ్మ మృతి చెందింది. రోడ్లు బురదమయం కావడంతో మహబూబాబాద్ జిల్లాలోని గార్లలో గిరిజనులు రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు.
భద్రాద్రిలో గోదావరి ఉధృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వల్ల గోదావరి గంటగంటకు పెరుగుతోంది. ఆదివారం రాత్రి 7 గంటలకు 38 అడుగులకు చేరుకుంది. రాత్రికి 43 అడుగులు చేరుకునే అవకాశం ఉండటంతో అధికారులు భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా అధికార యంత్రాంగం భావించి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చర్లలో తాళిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 24వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం సామర్థ్యం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి నిలువ 70.18 మీటర్లు ఉండగా, అంతకు మించి అధికంగా ఉన్న నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు డీఈ ఈ.తిరుపతి తెలిపారు. అశ్వారావుపేట మండల గుమ్మడివెళ్లి పెద్దవాగు ప్రాజెక్టు 3వ గేటు ఒక అడుగు ఎత్తి 4028 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.