Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీశాఖ దాడులను ఆపాలి
- మంత్రి సత్యవతి రాథోడ్ కు పోడు రైతు పోరాట కమిటీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోడు భూముల సమస్యను పరిష్కరించాలలనీ, అటవీ శాఖ దాడులను ఆపాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను పోడు రైతు పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కమిటీ నాయకులు ఆదివారం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పోడు సమస్య పరిష్కారానికి కమిటీగా ఏర్పడి ఏడాది కాలంగా పోరాడుతున్నట్టు వారు తెలిపారు. మంత్రి నుంచి సానుకూల స్పందన వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పోడు వ్యవసాయం చేయకుండా అటవీ శాఖ అధికారులు, పోలీసుల సహాయంతో అడ్డుకుంటున్నారని మంత్రి దృష్టికి తీసుకున్నారు. ట్రాక్టర్లు తదితర వ్యవసాయ పరికరాలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లలో పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. దాడి చేయడం, అరెస్టు చేయడం, జైళ్లో పెట్టడం, పంటలు నాశనం చేయకుండా సమస్యను చట్టపరంగా పరిష్కరించాలని కోరారు. అటవీ హక్కుల చట్టం అమలు చేసి పోడు రైతులకు న్యాయం చేయొచ్చని అభిప్రాయపడ్డారు. చట్టాన్ని అమలు ప్రక్రియ ముందుకుపోకపోగా, పోడు పట్టాలు రాకపోగా దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోడుపట్టాల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
గ్రామసభ తీర్మానం చేసినా, 2005కు ముందు నుంచి దున్నుకుంటున్నట్టు సాక్ష్యాలు చూయించినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెవెన్యూ పట్టా, అసైన్డ్ భూమి పట్టా ఉన్నా, అటవీ శాఖ ఇచ్చిన పట్టాను పట్టించుకోవడం లేదని తెలిపారు. పీసా చట్ట ప్రకారం...గ్రామ సభ తీర్మానం అసెంబ్లీ తీర్మానంతో సమానమని వారు గుర్తుచేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే విస్మరిస్తున్నదనీ, పోడు లేకపోతే వారికి తినేందుకు ఆహారం దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలనీ, పోడు రైతులపై దాడులను ఆపాలనీ, ఇప్పటికే పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల మల్లేష్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జె.చలపతిరావు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్,ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ తదితరులున్నారు.
మంత్రి హామీలు...
పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారనీ, త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యను పరిష్కరించే వరకు పోడు రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులను ఆపాలని అటవీశాఖ మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి దాడులు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తాను కూడా గిరిజన బిడ్డననీ, గిరిజన మహిళలపై అటవీ శాఖ అధికారుల దాడి దురదృష్టకరమన్నారు. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.