Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికోద్యమ నేత కొండ్రగుంట వెంకటేశ్వర్లు ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో కొండ్రగుంట వెంకటేశ్వర్లు 13 వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఆ యూనియన్ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షత వహించారు. నాయకులు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జె.వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్, వర్క్ఛార్జ్డ్, ఇరిగేషన్ వంటి సంఘటిత ఉద్యోగుల్లో ప్రత్యేక కృషితో యూనియన్ల నిర్మాణం చేశారనీ, అసంఘటిత కార్మికుల హక్కుల కోసం నిరంతరం తపించిన నాయకుడని తెలిపారు. కొండ్రగుంట రాష్ట్ర కార్యదర్శిగా, ఉపాధ్యక్ష బాధ్యతల్లో సుదీర్ఘకాలం పనిచేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక జేఏసీలో ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు. ట్రేడ్ యూనియన్ కొత్త కార్యకర్తలకు వారి అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని, ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితులలో వారి ఆశయసాధనలో ముందుకు సాగడమే మన కర్తవ్యమని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ.రమ మాట్లాడుతూ యూనియన్లను నిర్మాణయుతంగా నిర్మించారనీ, కార్యకర్తల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించారని కొనియాడారు. ఆయన నిర్మించిన యూనియన్లు ఇప్పటికీ ప్రభుత్వ విధానాలపై ప్రతిఘటన, పోరాటాల్లో ముందు వరుసలో ఉన్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. శ్రీకాంత్, హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, తదితరులు పాల్గొన్నారు.