Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు..
- భారీగా చేరుతున్న వరదనీరు
- వాతావరణ శాఖ హెచ్చరికతో గేట్లు ఎత్తివేత
- మూసీ నదిలోకి నీటి విడుదల
- మూసీ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి : ఎండీ దానకిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్(గండిపేట) జలాశయాలకు వరద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీనికి తోడు మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 686 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదిలారు. ఈ సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల అధికారులకు జలమండలి ఎండీ దానకిషోర్ సూచించారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగుల్లో 3.90టీఎంసీ నీరు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిస్థాయి నీటి మట్టం 1785.80 అడుగుల్లో 2.971టీఎంసీల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఉస్మాన్‌సాగర్‌లోకి 100క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మూసీలోకి రెండు గేట్ల ద్వారా 208 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా దీనిలో 2.97టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో 1760.30 అడుగుల్లో 2.32టీఎంసీల నీటితో నిండు కుండల మారింది. ఎగువ ప్రాంతాల నుంచి 100క్యూసెక్కుల నీరు వస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో రెండు గేట్ల ద్వారా 686 క్యూసెక్కుల నీటిని మూసీలో పంపిస్తున్నారు.