Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ చేపట్టాలని..
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి డిమాండ్
నవతెలంగాణ-ఓయూ
ఓయూ కావేరి హాస్టల్(సి)లో రెనోవేషన్ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్.మూర్తి డిమాండ్ చేశారు. ఎడతెరపిలేని వర్షాల నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నేతలు ఆదివారం ఓయూలోని సీ హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ కావేరి (సి) హాస్టల్‌కు రెండు కోట్లు పెట్టి మరమ్మతులు చేపట్టామని అధికారులు చెబుతున్నారని, కానీ ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే పై కప్పు నుంచి వర్షం నీరుపడే దుస్థితి ఏర్పడిందన్నారు. వర్షానికి నీళ్లు సీలింగ్‌లో పడి కరెంట్ షాక్ కొట్టినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇప్పటికీ యూనివర్సిటీ అధికారులు హాస్టల్ విజిట్ చేయకపోవడం, సరిగ్గా స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులను సంప్రదిస్తే కాంట్రాక్టర్‌ను అడగాలని తమకు సంబంధం లేదని చెప్పడం బాధ్యతారాహిత్యమని అన్నారు. తక్షణమే అధికారులు వీటిపైన స్పందించాలని కోరారు. రెనోవేషన్ పేరుతో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఓయూ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ.. హాస్టల్స్ పెచ్చులూడి విద్యార్థులపై పడుతున్నాయన్న విషయం గురించి ఓయూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కానీ వారు విని విననట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాత్రి పడుకునే టైంలో వర్షానికి ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలో విద్యార్థులు ఉన్నారని వాపోయారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షులు శ్రీను, సహాయ కార్యదర్శి కృష్ణ, జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ నాయక్, ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్, రమేష్ పాల్గొన్నారు.