Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న జరిగే భూ సదస్సు జయప్రదం చేయండి
- పేదలకు అన్యాయం చేస్తే సహించం
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
నవతెలంగాణ-కోదాడరూరల్/ మునగాల
గుడిసెవాసులకు పట్టాహక్కు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు గ్రామం రెవెన్యూ పరిధిలోని 142 సర్వే నెంబర్లో ఉన్న గుడిసెవాసుల గుడిసెలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సుమారు రెండున్నరేండ్ల నుంచి వ్యకాస ఆధ్వర్యంలో వారి ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తున్నామని, ప్రభుత్వం ఇక్కడ అనేక ఆటంకాలు సృష్టించిందన్నారు. అయినప్పటికీ పేదలందరూ ఐకమత్యంగా నాయకులతో కలిసి పోరాటాలు నిర్వహించారని తెలిపారు. ఈ భూమి విషయంలో హైకోర్టులో పేదల పక్షాన తీర్పు వచ్చిందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గుడిసెలు వేసుకున్న అర్హులైన పేదలందరికీ పట్టాలిచ్చి హక్కు కల్పించి, వాళ్ల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.3లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై ఈనెల 15న తొండ తిరుమలగిరిలో భారీ భూ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాపుగల్లు గుడిసె వాసులు వందల సంఖ్యలో ఈ బహిరంగ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో 129 సర్వేనెంబర్లో 9 ఎకరాల భూమిలో ఎర్రజెండాలు పాతి ఆక్రమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగా ప్రకృతివనం నిర్మాణం పేరుతో పేదల ఇండ్లస్థలాలను బలవంతంగా తీసుకుంటే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికీ గ్రామంలో పేదలు ఇండ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఇండ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.50 లక్షలు కేటాయించి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో బలహీన వర్గాలకు చెందిన కా లనీ యధావిధిగా నిర్మించి పేదలందరికీ పట్టాలిచ్చి మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలిది పద్మావతి, మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు సోమపంగ జానయ్య, నాయకులు నెమ్మాది సురేష్, వీరబాబు, మేరీ చిట్టెమ్మ, ప్రమీల, స్వప్న, లింగమ్మ, బోసుబాబు, గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు.