Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం పిలుపు
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంట రుణాల సాధన కోసం ఈనెల 14, 15 తేదీల్లో బ్యాంకుల వద్ద ధర్నాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. జూలైలో మెట్ట పంటలు, ఆగస్టులో వరినాట్లు వేయాల్సిన తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం సరైందికాదని పేర్కొంది. రైతులు యంత్రాల అద్దెలు, ఉపకరణాల కొనుగోళ్ళు తదితర పనులకు డబ్బు చాలా అవసరమనీ, తక్షణం బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 14,15 తేదీల్లో బ్యాంకుల ఎదుట జరిగే ధర్నాలను జయప్రదం చేయాలంటూ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, టి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వానాకాలం సాగు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నదనీ, ఇంతవరకూ బ్యాంకులు ప్రకటించిన రుణ ప్రణాళికను అమలు చేయలేదని విమర్శించారు. రుణాల మొత్తంలో 15శాతం దళిత, గిరిజనులకు విధిగా ఇవ్వాలంటూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీగానీ, జిల్లా స్థాయిలో జరుగుతున్న బ్యాంకర్ల సమావేశాలను విషయాలను పాటించడంలేదని విమర్శించారు. రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పంట రుణాలకు వానాకాలం రూ.51,230కోట్లు ప్రకటించారనీ, ఆచరణలో రైతులకు రుణాల పంపిణీ కావడం లేదని అన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రైతుల నుంచి వసూళ్లుగానీ, జప్తులుగానీ చేయరాదంటూ రిజర్వుబ్యాంకు ఆదేశాలున్నప్పటికీ రైతుబంధు నిధులను, ధాన్యం డబ్బులను బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా తమ పాత బాకీలలో కింద పెట్టుకుంటున్నాయని విమర్శించారు. రైతులు ప్రయివేటు రుణాల కోసం పరుగులు పెడుతున్నారన్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారులు 24శాతం నుంచి 36శాతం అక్రమ వడ్డీలు వసూళ్లు చేస్తున్నారనీ, వడ్డీ భారం పెరిగి అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ బ్యాంకులకు చెల్లించకపోవడంతో తిరిగి రైతులకు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నయని విమర్శించారు. ఏకమొత్తంలో మాఫీ చేయడం, రుణ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో వేసుకుని వాయిదాల ప్రకారం బ్యాంకులకు చెల్లించి, రైతులను రుణ విముక్తులను చేయాలని కోరారు. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పంట రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌లు తదితరులు పాల్గొన్నారు.