Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సారెస్పీ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- ప్రాజెక్టులోకి కొనసాగుతున్న 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
నవతెలంగాణ-మెండోరా
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీకి వరద నీరు పోటెత్తింది. 24 గంటల్లో ఏకంగా 33 టీఎంసీల వరద నీరు వచ్చి చేరడంతో ఒక్క రోజులోనే ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 2.12 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్టు ప్రాజెక్టు ఏఈఈ మామిడి వంశీ తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ప్రాజెక్టులో 39 టీఎంసీల నీరు నిలకడగా ఉండగా మహా రాష్ట్ర, ఎగువ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయానికి అంటే 24 గంటలలో 33 టీఎంసీల నీరు చేరింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి నాలుగు రోజులుగా భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరువలో ఉన్నందున అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు 9 గేట్లను ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 1086.90 అడుగులు (72.908 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 5 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ రెడ్డి, సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్, ప్రాజెక్టు అధికారులు, మండల ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.