Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 11న జరగాల్సిన రిలే ఆమరణ నిరాహార దీక్షలు 20కి వాయిదా
- కొత్త బొగ్గు బావులు తీసి ఉపాధి అవకాశాలు కల్పించాలి
- చైర్మెన్ శ్రీధర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి గులాంగా మారి.. సంస్థను తాకట్టు పెట్టారు
- మీడియా సమావేశంలో సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చ లేదని, పెండింగ్‌లో ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఈ నెల 20న రిలే ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు అన్నారు. కాగా, ఈనెల 11న జరగాల్సిన దీక్ష 20 తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మంచికంటి సీఐటీయూ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోల్ మైన్ ఏరియాలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నప్పటికీ యాజమాన్యం కొత్త బొగ్గు బావులు తీయకుండా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కాలయాపన చేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా వెంటనే కొత్త బొగ్గు బావులు తీసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సింగరేణిలో ఒక లక్ష మంది కార్మికులను 40 వేల మంది కార్మికులకు కుదించి, కాంట్రాక్టు కార్మికులను పెంచారని, వారికి కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సంస్థ ఉత్పత్తి, ఉత్పదకత మీద దృష్టి పెట్టింది కానీ, కార్మిక సంక్షేమం, రక్షణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ప్రతి ఏడాది సుమారు 40 మంది కార్మికులు గని ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు.
దేశంలోనే కోల్ ఇండియా, రాష్ట్రంలో సింగరేణి సంస్థ స్వతంత్ర సంస్థల అయినప్పటికీ ఏడేండ్లుగా సింగరేణి సంస్థలో సింగరేణి చైర్మెన్ ఎన్.శ్రీధర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గులాంగా మారి సంస్థను తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిందని, సంస్థ ఎన్నికల్లో కార్మికులను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక సమస్యలు పరిష్కారంలో యూనియన్లతో చర్చించేందుకు కుదరని సమయం, రాష్ట్ర ముఖ్యమంత్రి చాంబర్లో ఉండటానికి చైర్మెన్కి ఎలా సమయం కుదురుతుందని ప్రశ్నించారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా చర్చల్లో సంప్రదించి వారి సమస్యలు పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. 9వ, 10వ వేతన ఒప్పందాల చర్చల్లో చైర్మెన్ ఉన్నప్పటికీ ఒప్పందంలోని అంశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. కార్మికులకు సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం కేటాయించాలని, కార్మికులు నివసిస్తున్న క్వార్టర్స్‌ను శాశ్వతంగా వారికే ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని, రిటైర్డ్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఖాళీ క్వార్టర్లు కేటాయించాలని, బినామీ పేర్ల మార్పు సర్క్యులర్ వెంటనే జారీ చేయాలని, డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్ఎల్సీ వద్ద జరిగిన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. పెర్క్స్ (అలవెన్స్ మీద) ఇన్ కమ్ టాక్స్ 2011 నుంచి కార్మికులకు తిరిగి చెల్లించాలని, 190/240 మాస్టర్ల నిండిన బదిలీ వర్కులను జనరల్ మజ్దూర్‌గా పదోన్నతి, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలన్నారు. సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగాని కృష్ణయ్య, కొత్తగూడెం బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు గాజుల రాజారావు, విజయగిరి శ్రీనివాస్, వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.