Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భౌతిక వసతులతో విద్యాసంస్థలు నిర్వహించాలి
- మధ్యాహ్న భోజన నిధులు పెంచాలి
- హాస్టల్స్ విద్యార్థుల మెస్ చార్టీలు పెంచాలి
- మన కాలేజ్-మనపట్టణం.. మన యూనివర్సిటీ-మన నగరం ప్రారంభించాలి
- మీడియా సమావేశంలో టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యాసంస్థల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు భౌతికంగా అన్ని వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులు వెంటనే భర్తీచేయాలని, మధ్యాహ్న భోజన నిధులు పెంచి, నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్స్ విద్యార్థులకు మెస్ చార్టీలుపెంచాలని టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యారంగంలో మన ఊరు-మనబడి, మనటౌన్-మనబడి కార్యక్రమం చాలా గొప్పగా ప్రారంభించినా పనుల ప్రక్రియ మాత్రం మందకోడిగా సాగుతున్నాయన్నారు. స్కూళ్లలో తరగతి గదుల కొరత ఉందని, ఫర్నిచర్, ప్రహరీలు లేవన్నారు. తరగతి గదులు లేకుండా తరగతులు నిర్వహిచడం సాధ్యం కాదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల స్కూల్స్‌లో హెచ్ఎం, దాదాపు 8వేల వరకు సబ్జెక్టు టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు పాఠశాల పారిశుధ్యం అప్పజెప్పినప్పటికీ ఎక్కడకూడా సక్రమంగా జరగడం లేదని తెలిపారు. గతంలో సమగ్ర శిక్షణ నుంచి పాఠశాలకు సర్వీస్ పర్సన్ ఇచ్చేవారని, సమగ్ర శిక్షణకు 60 శాతం డబ్బులు కేంద్రం, 40 శాతం రాష్ట్రం ఇవ్వాలి కానీ కేంద్రం ఏదో అడ్డుకులేసిందని చెప్పి దాని తొలగించారన్నారు. నూతన విద్యా విధానం ప్రకారం కేంద్రం నిధులు పెంచాలన్నారు. వెంటనే పదోన్నతలు పూర్తిచేసి నిరుద్యోగులకు రిక్రూట్ మెంచ్ చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనం చేసే వర్కర్స్ రూ. వెయ్యి నుంచి రూ.3వేలు ఇస్తానని శాసనసభలో సీఎం ప్రకటించినా ఇప్పటికీ అమల్లోకి రాలేదన్నారు. మధ్యాహ్న భోజనం హై స్కూల్ పిల్లలకు రూ.10లు, ప్రైమరీ పిల్లలకు రూ.8లు చొప్పున ఇస్తేనే సక్రమంగా సాగుతుందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం 1 నుంచి 8 వరకు ఇంగ్లీషు బోధన పెట్టారని, పుస్తకాల ప్రింటింగ్ ఆలస్యం అయినందున జులై 21 నుంచి ప్రారంభిస్తున్నారని, అప్పటివరకైనా విద్యార్థులందరికీ పుస్తకాలు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సంవత్సరం స్టేషనరీలో చాక్‌పీస్ కొనేందుకు కూడా పైస ఇవ్వలేదని ఆరోపించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని, దానికనుగుణంగా అవసరమైన గెస్టు లెక్చరర్స్‌ని నియమించాలన్నారు. రెగ్యులర్ అధ్యాపకులు 700 ఉంటే 3వేల మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారని తెలిపారు. నిత్యవసర ధరలు పెంచిన నేపద్యంలో హాస్టల్స్, రెసిడెన్సియల్ విద్యార్థులకు మెస్చార్టీలు పెంచాలని, కేజీ టూ పీజీ అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం ప్రయివేటు విద్యకే పెద్దపీట వేస్తుందని ఆరోపించారు. ఉన్నత విద్యలో మన టౌన్-మన కాలేజ్, మన నగరం -మన యూనివర్సీటీ పేరిట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీలను బలోపేతం చేసి విద్యావ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్లులు బి.కిషోర్‌సింగ్, ఎన్.కృష్ణ, ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మీ, కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.