Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇచ్చిన హామీ అమల్లో సీఎం కేసీఆర్ విఫలం
- హక్కుపత్రాలిచ్చే వరకూ ఐక్యఉద్యమం
- ఎన్నికల హడావుడిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ
- మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న కాషాయపార్టీ
- 25, 26, 27 తేదీల్లో హన్మకొండలో రాష్ట్ర కమిటీ సమావేశాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదివాసీ గిరిజన మహిళలపై అటవీ, పోలీసు అధికారులు దాడులు చేయడం తగదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. పోడుసాగుదార్లకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడుతూ ప్రజాసమస్యలు, ప్రధానంగా పోడు భూముల, ఇతర సమస్యలపై కార్యదర్శివర్గంలో చర్చించామన్నారు. గతంలో గిరిజన సంఘాలు, అఖిలపక్ష పార్టీలు కలిసి గతేడాది అక్టోబర్ ఐదున అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు సంపూర్ణ సడక్‌బంద్ జరిగిందని గుర్తు చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పారు. పోడు భూములకు పట్టాలిస్తామన్నారనీ, కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తామన్నారని వివరించారు. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పోడు భూముల జోలికి అటవీ అధికారులు, పోలీసులు వెళ్లబోరంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగు లక్షల దరఖాస్తులొచ్చాయని, వాటిని పరిశీలించి, అర్హులెవరు కానివారెవరు అన్నది తేలుస్తామని సీఎం వివరించినట్టు చెప్పారు. వాటిని పరిష్కరించకపోగా అటవీ అధికారులు, పోలీసులు పోడు సాగు చేసుకుంటున్న గిరిజను లు, ఆదివాసీలపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడెంలో 12 మంది మహిళలు, చిన్నపిల్లల తల్లులపై కేసులు పెట్టి జైలుకు పంపడం సంచలనమైందని వివరించారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదలయ్యాక మళ్లీ దాడు లు చేశారని విమర్శించారు.
ఇది పోడు భూముల కోసం పోరాడుతున్న గిరిజనుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడమేననీ, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అ న్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల వంటి జిల్లాల్లో పెద్ద ఎత్తు న అటవీ అధికారులు, పోలీసులు దాడులు చేస్తున్నా రని విమర్శించారు. అఖిలపక్ష కమిటీ, పోడు పోరాట కమిటీ చర్చించి రాబోయే కాలంలో ప్రత్యక్ష కార్యాచ రణకు పూనుకోవాలని నిర్ణయించాయన్నారు. భద్రా చలం నుంచి హైదరాబాద్ వరకు సుదీర్ఘమైన పాద యాత్రకు గిరిజన సంఘాలు సన్నద్ధమైతే తమ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందని తమ్మినేని చెప్పారు. పోడుసాగుదార్లకు హక్కుపత్రాలిచ్చే వరకూ పోరా టం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రజాసమస్యలను పక్కనపెట్టిన బూర్జువాపార్టీలు
ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలను పక్కనపెట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల హడావుడి చేస్తున్నాయని తమ్మినేని ఈ సందర్భంగా విమర్శించారు. ఈ బూర్జువా పార్టీలన్నీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయని చెప్పారు. తక్షణ ప్రజా సమస్యలపై కేంద్రీకరించకుండా విస్మరిస్తున్నాయని అన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని విమర్శించారు. హిందూఏక్తా యాత్రలో బండి సంజరు, బీజేపీ బహిరంగసభలో మోడీ, అమిత్‌షా సైతం హైదరాబాద్‌ను భాగ్య నగర్‌గా మారుస్తామనడంతోపాటు, అధికారం తమదే అంటూ రెచ్చగొట్టారని అన్నారు. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిడాన్ని గమనిస్తే ఈడీ, సీబీఐ బెదిరింపులు ఏ స్థాయికి వెళ్లాయో అర్థమవుతున్నదని చెప్పారు. అంతకుముందు డబ్బు, ప్రలోభాలకు గురి చేసేవారనీ, ఇప్పుడు కొత్తపంథాను అనుసరించి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చారని విమర్శించారు. తెలంగాణలోనూ షిండేలున్నారనే విషయం అమిత్‌షా మాటలను బట్టి అర్థమ వుతున్నదని అన్నారు. దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ తీరును పార్టీలు, ప్రజలు తప్పుపట్టాలనీ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను సరిదిద్దుకోవాలి
ప్రజా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ, మతోన్మాదం, అగ్నిపథ్ వంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వ పాలనపై సీఎం కేసీఆర్ విమర్శలను తమ పార్టీ సమర్థిస్తున్నదని తమ్మినేని చెప్పారు. అదే సమయంలో టీఆర్ఎస్ పాలనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీపై విమర్శలకే పరిమితమైతే ఉపయోగం లేదన్నారు. డబుల్బెడ్రూం ఇండ్లు, దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు, గీత, నేత, బీడీ కార్మికులకు పింఛన్లు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు, పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మి దరఖాస్తులు, ధరణి లోపాలు, కొత్త రేషన్‌కార్డుల జారీ వంటి సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేశారు.
ధరణిలో ఉన్న లోపాలను సవరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తామనడం సరైంది కాదన్నారు. ఈ పథకం మొత్తం తప్పని సీపీఐ(ఎం) భావించడం లేదని చెప్పారు. రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట కార్యాచరణ రూపొంది స్తామని వివరించారు. అందులో భాగంగానే ఈనెల 25,26,27 తేదీల్లో హన్మకొండలో తమ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలను నిర్వహిస్తున్నామని అన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఏ విజయరాఘవన్ ఈ సమావేశాలకు హాజరవుతారని వివరించారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలను పెంచేందుకు, వామపక్ష పార్టీలను ఐక్య కార్యాచరణవైపు మళ్లించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తమ్మినేని ఈ సందర్భంగా అన్నారు.